Network Portability: డెబిట్-క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు RBI గుడ్ న్యూస్!!
X
బ్యాంకింగ్ కస్టమర్ల సౌలభ్యం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్(RBI) ఓ కొత్త వెసులుబాటును కల్పించనుంది. ప్రస్తుతం, వివిధ కంపెనీల కార్డులకు వేర్వేరు చెల్లింపు నెట్‌వర్క్‌లు ఉన్నాయి. దీని కారణంగా నెట్‌వర్క్ కంపెనీల గుత్తాధిపత్యం పెరిగిపోయింది. ఈ ట్యాపింగ్ విధానానికి స్వస్తి పలకాలని రిజర్వ్ బ్యాంక్ యోచిస్తోంది. ఇందుకోసం కొత్త డ్రాఫ్ట్‌ను తీసుకురావాలని సెంట్రల్ బ్యాంక్ ఆలోచిస్తోంది. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్డులకు ఒకే సిస్టమ్ పని చేస్తుంది.
ప్రస్తుతం మన దేశంలో వీసా (Visa), మాస్టర్ కార్డ్ (MasterCard), రూపే (RuPay), అమెరికన్ ఎక్స్‌ప్రెస్ (American Express), డైనర్స్ క్లబ్ (Diners Club) సంస్థ కార్డు నెట్‌వర్క్ సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థలు... బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీని ప్రకారం.. కస్టమర్ కు ఏ కార్డు జారీ చేయాలన్నది సదరు కార్డు జారీ సంస్థదే నిర్ణయం. ఇకపై ఈ విషయంలో కస్టమర్‌దే ఫైనల్ డెసిషన్ కానుంది. అంటే.. వీసా కార్డ్ ఉన్న వారు మాస్టర్ కార్డ్, రూపే లేదా మరేదైనా నెట్‌వర్క్‌కు మారాలనుకుంటే ఇకపై మారొచ్చు. దీనికి సంబంధించి ఆర్‌బీఐ తన తాజా ముసాయిదా సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై ప్రస్తుతం అభిప్రాయాలు కోరుతోంది. అక్టోబర్ 1 నుంచి ఈ సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సన్నద్ధం అవుతోంది.
ముసాయిదా ప్రకారం.. కార్డ్ జారీచేసే వారు ఆయా సంస్థలతో ముందస్తు ఒప్పందాలు చేసుకొని.. కస్టమర్లు ఇతర నెట్‌వర్క్‌ల సేవలను పొందకుడా నిరోధించకూడదు. సదరు సంస్థ ఒకటి కంటే ఎక్కువ ఫైనాన్షియల్ నెట్‌వర్క్‌లతో సంబంధాలు పెట్టుకోవాలి. వాటికి సంబంధించిన కార్డులను జారీ చేయాలి. అర్హులైన కస్టమర్లకు కార్డ్‌ను ఎంచుకొనే వెసులుబాటును కల్పించాలి. ఎప్పుడైనా పోర్ట్ చేసుకొనే అవకాశం ఉండాలి.