Mukesh Ambani : దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్
X
భారతదేశంలో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది. 2023 అక్టోబర్ నాటికి ఆయా సంస్థల మార్కెట్ విలువ ఆధారంగా బర్గండీ ప్రైవేట్, హురూన్ ఇండియా సంస్థలు సంయుక్తంగా ఓ నివేదికను రూపొందించాయి. అందులో రిలయన్స్ మార్కెట్ విలువ రూ.15.6 లక్షల కోట్లతో తొలి స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ విలువ రూ.19.65 లక్షల కోట్లుగా ఉంది. ఇకపోతే రెండో స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.12.4 లక్షల కోట్లతో నిలిచింది. ప్రస్తుతం టీసీఎస్ విలువ రూ.14.90 లక్షల కోట్లుగా ఉంది. మూడో స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నిలిచింది. ఈ బ్యాంకు ప్రస్తుత విలువ రూ.10.55 లక్షల కోట్లుగా ఉంది.
ప్రైవేటు రంగంలోని టాప్ 500 కంపెనీలకు సంబంధించి మార్కెట్ విలువ 2.8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అంటే సుమారు రూ.231 లక్షల కోట్లుగా ఉంది. సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, సింగపూర్ దేశాల సంయుక్త జీడీపీ కంటే ఈ కంపెనీల విలువే ఎక్కువ. ఈ కంపెనీల్లో దేశవ్యాప్తంగా 70 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.