Vijay Shekhar Sharma : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ రాజీనామా..ఆర్బీఐ ఆంక్షలు కుదేలైన పేటీఎం
X
పేటీఎం వ్యవస్థాపకుడు బ్యాంకు ఛైర్మన్ విజయ్ శేఖర్ శర్మ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు మార్చి15 వరుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గడువు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఆ గడువుకు ముందే విజయ్ నిష్క్రమించారు. ఇప్పటికే ఆర్బీఐ ఆంక్షలతో సతమతమవుతున్న ప్రముఖ చెల్లింపు సంస్థ పేటీఎం మరోసారి కుదేలైంది. ఎవరైతే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు, ఫాస్టాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు (ఎన్సీఎమ్సీ) వాడుతున్నారో వారు మార్చి 15లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. అంతకుముందు ఈ ఫిబ్రవరి 29 వరకు గడువు విధించింది. తర్వాత దాన్ని మార్చి 15కు పొడిగించింది. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ గా నాలుగైదు బ్యాంకులతో భాగస్వామ్యం కోరుతూ పేటీఎం దాఖలు చేసుకున్న అభ్యర్థనను పరిశీలించాలని ఆర్బీఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)అని కోరింది.
భారత్ లో యూపీఐ చెల్లింపుల రంగంలో మూడో అతిపెద్ద యాప్ గా ఉన్న పేటీఎం త్వరలోనే యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, యెస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం విధించిన అనంతరం ఆర్బీఐ స్పందించడం ఇదే రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ప్రకటన తరువాత పేటీఎం షేర్లు దారుణంగా పతనమయ్యాయి. పాతాళానికి పడిపోయాయి. ఒకదశలో 52 వారాల్లో గరిష్ఠంగా 998 రూపాయల వరకు వెళ్లిన వాటి షేర్ ప్రైస్ ఒక్కసారిగా కూప్పకూలింది. 300 రూపాయలకు పడిపోయింది. నిషేధం అమలు గడువును ఆర్బీఐ పొడిగించిన నేపథ్యంలో పేటీఎం షేర్ల ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. ఈ సడలింపు ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రతి రోజూ అప్పర్ సర్క్యుట్‌లో ట్రేడ్ అవుతూ వస్తోన్నాయి పేటీఎం షేర్ల ధరలు. అయిదు శాతం మేర పెరుగుతూ వస్తోన్నాయి. నేడు పేటీఎం ఒక్కో షేర్ ధర రూ.428.10 పైసల వద్ద ట్రేడ్ అయింది. అంతా సజావుగా సాగుతోందనుకున్న ఈ దశలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ మీద మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో, పీపీబీఎల్ బోర్డ్ నుంచి ఒక స్వతంత్ర డైరెక్టర్ వైదొలిగారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్ మంజు అగర్వాల్, తన వ్యక్తిగత కారణాల వల్ల 2024 ఫిబ్రవరి 01న బోర్డుకు రిజిగ్నేషన్ చేసినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేటీఎం కూడా ప్రకటించింది.