మతహింసలో సడేమియా.. పోలీస్ స్టేషన్ పై దాడి.. ఫైళ్లు ధ్వంసం
X
మణిపూర్ మంటలు చల్లారకముందే హర్యానాలో మత హింస చెలరేగింది. ఈ హింసలో ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. సోమవారం నుహ్ జిల్లాలో వీహెచ్పీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీని ఓ వర్గం అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పాటు కార్లకు నిప్పుపెట్టారు. అటు గురుగ్రామ్లో మసీదుకు కొందరు నిప్పు పెట్టారు.
ఈ హింసను కొందరు నేరగాళ్ళు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. సైబర్ పోలీస్ స్టేషన్ను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఓ బస్సుతో స్టేషన్ పై దాడి చేయడంతోపాటు కీలకమైన డాక్యుమెంట్స్, సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. స్టేషన్ బయట ఉన్న కార్లను కూడా దుండగులు ధ్వంసం చేశారు. ఎక్కువ సైబర్ క్రైం కేసులు నమోదవడం.. పైగా సైబర్ క్రైం పోలీసులు నేరగాళ్లపై కొరడా ఝుళిపించడంతోనే స్టేషన్పై దాడి చేసినట్లు సమాచారం. ఫైళ్లు తగలబెడితే కేసుల నుంచి తప్పించుకోవచ్చనేది వారి ఆలోచనగా తెలుస్తోంది.
కాగా నుహ్ జిల్లాలో పోలీసులు పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేశారు. జిల్లాలో కర్ఫ్యూ విధించి..పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్న వీడియోల ఆధారంగా నిందితుల్ని అరెస్టు చేస్తున్నారు. అటు సోహ్నా, మనేశ్వర్, పటౌడి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఈ హింస ఘటనలో ఇప్పటివరకు 20కేసులు నమోదు చేశారు.