Bombay High Court: లంచం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగిని నిర్ధోషిగా ప్రకటించిన హైకోర్టు
X
లంచంగా రూ.100 తీసుకోవడం పెద్ద నేరమేమీ కాదని చెప్పింది సాక్షాత్తూ హైకోర్టు. రూ.100 లు చాలా చిన్న అమౌంట్ అని.. ఆ మొత్తాన్ని తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగిని నిర్ధోషిగా విడుదల చేసింది న్యాయస్థానం. ముంబై హైకోర్టులో న్యాయమూర్తి జితేంద్ర జైన్ తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం తాజాగా ఈ తీర్పునిచ్చింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు కూడా సమర్ధించి ఈ సంచలన తీర్పునిచ్చింది.
మహారాష్ట్రలోని పూణెలోని పౌడ్ గ్రామీణ ఆసుపత్రిలో అనిల్ షిండే అనే డాక్టరు వైద్య సేవలందిస్తున్నారు.ఈ క్రమంలో ఆయన డ్యూటీలో ఉండగా 2007లో ఎలీ పింగై అనే వ్యక్తి గాయాలతో వచ్చాడు. తనపై కొంతమంది దాడి చేశారని తనకు గాయాలు అయినట్లుగా సర్టిఫికెట్ ఇవ్వాలని కోరాడు. దానికి డాక్టర్ అనిల్.. రూ.100లు ఇస్తే సర్టిఫికెట్ ఇస్తానని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో అతను డబ్బు ఇస్తుండగా పక్కా ప్లాన్ ప్రకారంగా అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా బుక్ అయ్యాడు.
అనిల్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించారు అధికారులు. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం 2012 జనవరిలో న్యాయస్థానం డాక్టర్ ను నిర్ధోషిగా ప్రకటించిది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది. విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు కూడా స్పెషల్ కోర్టు తీర్పును సమర్ధిస్తూ డాక్టర్ అనిల్ ను నిర్ధోషిగా ప్రకటించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ రూ.100 లంచం తీసుకోవడం చాలా చిన్న విషయమని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం నిందితుడిని నిర్దోషిగా పరిగణిస్తున్నామని తీర్పు వెలువరించింది.