మేం ఓడిపోతే అణ్వాయుధ దాడే... రష్యా మాజీ అధ్యక్షుడు
X
ఏడాది దాటిపోయినా రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడడం లేదు. అమెరికా సహా పలు నాటో దేశాల అండతో ఉక్రెయిన్ రష్యాను దీటుగా ఎదుర్కొంటోంది. రష్యా కూడా వెనక్కి తగ్గకుండా వేల కోట్లు ఖర్చు చేసి దాడులు సాగిస్తోంది. చివరికి ప్రిగోజిన్ లాంటి కిరాయి సైనిక నేత సాయమూ తీసుకుంటోంది. చావనైనా చస్తాం తప్ప లొంగిపోయే ప్రసక్తే లేదంటున్నాడు ఉక్రెయిన్ అధినేత వ్లదిమీర్ జెలెన్‌స్కీ. ఈ నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో రష్యా ఓడిపోతే అణు దాడి తప్పదని హెచ్చరించారు. అయతే పరిస్థితి రాకూడదనే తామూ కోరుకుంటున్నామని, అందుకే ఉక్రెయిన్ రష్యా గెలుపు కోరుకోవాలని చెప్పుకొచ్చారు. ఆయన ప్రస్తుతం రష్యా భద్రతా విభాగం ఉపాధ్యక్షుడు కావడంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అమెరికా సారథ్యంలోని ‘నాటో’ కూటమి మద్దతుతో ఉక్రెయిన్ తమపైన పైచేయి ఆ దేశంపై అణుదాడి చేయక తప్పని పరిస్థితి ఎదురవుతుందని మెద్వెదేవ్ అన్నారు. ‘‘ఇక తేల్చుకోవాల్సింది ఉక్రెయినే. అణుబాబు పేలకుండా చూసుకోవడం వాళ్ల చేతుల్లోనే ఉంది’’ అని మెద్వెదేవ్ సోషల్ మీడియా పోస్టులో అన్నారు. ఆదివారం మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ల దాడి జరిగిందని, వాటిని తిప్పికొట్టామని రష్యా చెప్పిన నేపథ్యంలో మెద్వెదేవ్ హెచ్చరికలు జారీ చేశారు. డ్రోన్ల దాడికి పాల్పడింది ఉక్రెయినే అని రష్యా ఆరోపించింది.