Sabarimala: మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం
X
ప్రముఖ దివ్యక్షేత్రం శబరిమల దేవాలయం 41 రోజుల మండల పూజల అనంతరం.. మకరజ్యోతి ఉత్సవాల కోసం మళ్లీ తెరుచుకుంది. శనివారం సాయంత్రం ఆలయ ప్రధాన పూజారి కండారు మహేశ్ మోహనరారు సమక్షంలో మరో పూజారి పీఎన్ మహేశ్ నంబూద్రి అయ్యప్ప ఆలయ ద్వారాలను తెరిచారు. మకరజ్యోతి ఉత్సవాల్లో భాగంగా జనవరి 13న ప్రసాద శుద్ధక్రియ, 14న బింబ శుద్ధక్రియలను నిర్వహించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. 15న మకరజ్యోతి వేడుకను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. భక్తుల కోసం జనవరి 20వ తేదీ వరకు ఆలయం తెరిచే ఉంటుంది. అదే రోజున సన్నిధానంలో స్వామివారికి తిరువాభరణం, దీపారాధన ఉంటాయని తెలిపింది. జనవరి 20న పూజల అనంతరం దేవాలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపింది.
ఇక మండల పూజలు జరిగిన 41 రోజుల పాటు శబరిమలకు భారీగా భక్తులు పోటెత్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో శబరిగిరులు కిక్కిరిసిపోయి.. అయ్యప్ప నామస్మరణతో మార్మోగాయి. ఈ క్రమంలోనే భక్తుల రద్దీని కేరళ పోలీసులు నియంత్రించలేకపోవడంతో ఒకదశలో లాఠీఛార్జ్ కూడా జరిగింది.అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా 41 రోజుల మండల పూజల సీజన్‌కు భక్తులు పోటెత్తడంతో మకరజ్యోతి సందర్భంగా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వర్చువల్ క్యూ లైన్ల టిక్కెట్ల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మకరజ్యోతికి భారీగా భక్తులు పోటెత్తకుండా జనవరి 14, 15 తేదీల్లో వర్చువల్ క్యూ బుకింగ్‌లను 50 వేలకు తగ్గించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ ప్రెసిడెంట్ పీసీ ప్రశాంత్ చెప్పారు. యాత్రికుల రద్దీని ఊహించి.. ముందస్తు బుకింగ్‌లు లేకుండా ఈ రెండు రోజుల్లో స్పాట్ బుకింగ్‌లను 10 వేలకు పరిమితం చేయనున్నట్లు తెలిపారు. ఇంకా ఈ రెండు రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులు నేరుగా పంబకి వెళ్లే బదులు నిలక్కల్‌లో స్పాట్ బుకింగ్‌లను చేసుకునే అవకాశం కల్పించనున్నారు.