ఎన్నికలముందు సచిన్ టెండూల్కర్‌కు కీలక బాధ్యతలు
X
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరో కీలక బాధ్యతలకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎక్కువ మంది ఓటర్లను ప్రోత్సాహించేందుకు సచిన్ టెండూల్కర్‌తో ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సచిన్‌ను నేషనల్ ఐకాన్‌గా ఈసీ నియమించనున్నది. బుధవారం టెండూల్కర్ మరియు పోల్ ప్యానెల్ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం మూడేళ్లు పాటు ఓటుహక్కుపై టెండూల్కర్ అవగాహన కల్పించనున్నారు. దేశ వ్యాప్తంగా టెండూల్కర్‌కు ఉన్న గుర్తింపు యువతపై ప్రభావాన్ని చూపుతుందని ఈసీ అభిప్రాయపడింది. 2024 లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా సచిన్ ఓటర్ల చైతన్య ప్రచారం నిర్వహిస్తారని తెలిపింది.
గతంలో కూడా ఈసీ పలువురు ప్రముఖుల్ని నేషనల్ ఐకాన్‌గా నియమించుకుంది. 2022లో బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి నేషనల్ ఐకాన్‌గా ఓటర్లకు అవగాహన కల్పించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు అమీర్ ఖాన్, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, మేరీ కోమ్‌లు ఈ బాధ్యతలను నిర్వర్తించారు. తాజాగా సచిన్ టెండూల్కర్‌ను వాడుకునేందుకు ఈసీ సిద్ధమైంది.
50 ఏళ్ల టెండూల్కర్..ఇండియా తరఫున అన్ని ఫార్మెట్లలో 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 34,357 పరుగులు చేశాడు. ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి సచిన్ రికార్డులకెక్కాడు. టీమిండియా 2011 వరల్డ్ కప్ సాధించడంలో సచిన్ టెండూల్కర్ కీలక పాత్ర పోషించాడు.