Women railway coolie: ‘కూలీగా మారి కుటుంబ భారాన్ని మోస్తూ’.. కన్నీళ్లు పెట్టిస్తున్న సంధ్య కథ
X
భర్త మరణం.. వాళ్ల కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ముగ్గురు పిల్లలు, అత్తామామల బాధ్యత తనపై పడింది. కలల్ని నెరవేర్చుకుంటూ.. భర్తాపిల్లలతో జీవితంలో ముందుకు వెళ్లాల్సిన సమయంలో, బాధ్యత అనే బరువు ఆమెపై తలపై పడింది. అయినా బతుకు బండి లాగడాన్ని ఎప్పుడూ భారం అనుకోలేదు. కుటుంబ బాధ్యతంతా.. తనపై వేసుకుంది. ముగ్గురు పిల్లలు, అత్తమామల పోషణ తానే చూసుకుంటుంది. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంది. సొంత కాళ్లపై నిలబడి.. మగవారితో సమానంగా పనిచేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో సాహసోపేతమైన అడుగు వేసి.. ఏ మహిళ చేయని రైల్వే కూలీ వృత్తిలో అడుగుపెట్టింది. దాన్ని సమర్థంగా నిర్వహిస్తూ.. కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎంతోమందికి ప్రేరణగా, స్పూర్తిగా నిలుస్తున్న ఆమె పేరు.. సంధ్యా మరావి. ఉంటుంది మధ్యప్రదేశ్, జబల్ పూర్ లోని కుండం గ్రామంలో.
కుండం గ్రామంలో నివసించే సంధ్య (31) భర్త రైల్వే కూలీగా పనిచేశాడు. అంతా సాఫీగా సాగుతున్న జీవితంలో.. విధి వంచింది. 2016లో సంధ్య భర్త చనిపోయాడు. ఇక అప్పటి నుంచి ఆమెనే కుటుంబాన్ని పోషిస్తుంది. సంధ్యకు ముగ్గురు పిల్లలు. వారిని బాగా చదివించాలనే పట్టుదలతో జీవితంలో ముందుకు సాగుతుంది. ఆమె భర్త చనిపోయాక.. ఇంటిని నడపడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో వారి గ్రామానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్నీ రైల్వే స్టేషన్ లో కూలీగా పనిచేసే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న సంధ్య.. కూలీగా చేరింది. అందుకని ప్రతీరోజూ జబల్ పూర్ నుంచి కట్నీకి ప్రయాణించి డ్యూటీలో చేరుతుంది. ప్రస్తుతం వారి కుంటుంబం బాగానే నడుస్తుందని సంధ్య చెప్పింది. సంధ్య పనిచేస్తున్న స్టేషన్ లో 40 మంది కూలీలు ఉండగా.. అందులో ఆమె ఒక్కరే మహిళ.
‘‘భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. తినడానికి తిండి లేదు. నా ముగ్గురు పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఈ వృత్తిని ఎంచుకున్నా. నా పిల్లల్ని బాగ చదివించి ప్రయోజకుల్ని చేయాలనేది నా కల’’ అని సంధ్య చెప్తుంటుంది.