Home > జాతీయం > కళ్లముందే కాలిపోతున్నా..ఏమీ చేయలేకపోయాం!

కళ్లముందే కాలిపోతున్నా..ఏమీ చేయలేకపోయాం!

కళ్లముందే కాలిపోతున్నా..ఏమీ చేయలేకపోయాం!
X

మహారాష్ట్రలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనమయ్యారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి కావడం.. ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉండడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో పలువరి పరిస్థితి విషమంగా ఉంది. 32మంది ప్రయాణికులతో బస్సు నాగపూర్ నుంచి పూణే వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో బస్సు టైర్ పేలి బోల్తాపడింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగ్గా.. మంటలు ధాటికి బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.

కిటికీ అద్దాలు బద్దలుకొట్టాం :

ప్రమాదం జరిగిన సమయంలో కొంత మంది ప్రయాణికులు బస్సులోని కిటికీ అద్దాలను పగలగొట్టి ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రమాదం గురించి విస్తుపోయే విషయాలను మీడియాతో తెలిపారు. ప్రమాదం నుంచి తప్పించుకున్న ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ.."టైరు పేలడంతో బస్సు డివైడర్‌ను ఢీ కొంది . క్షణాల్లోనే బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు వెనకాల ఉన్న కిటికీ అద్దాలను బద్దలుకొట్టి నేనే, నా తోటి ప్రయాణికుడు ప్రమాదం నుంచి బయటపడ్డాం’’ అని తెలిపాడు.

కళ్లముందే అంతా అయిపోయింది :

ప్రమాదాన్ని దగ్గరుండి చూసిన స్థానికులు మాట్లాడుతూ..‘‘ సాయం కోసం బస్సులో ఉన్నవారు మమ్మల్ని పిలిచారు. కానీ మేం వెళ్లేసరికే అంతా అయిపోయింది. ఈ ప్రాంతం అంతా భయానకంగా మారింది. బస్సు టైర్లు విరిగి దూరంగా పడ్డాయి. బస్సులో మంటల్లో చిక్కుకున్నవారు అద్దాలు బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. సాయం కోసం అర్థిస్తూనే చాలా మంది మా కళ్లముందే మంటల్లో కాలిపోయారు. మంటల పెద్ద ఎత్తున ఎగసిపడటంతో మేం ముందుకు వెళ్లి ఎవరినీ కాపాడలేకపోయాము. వారి పరిస్థితి చూసి మాకు కన్నీరాగలేదు’’ అని చెప్పారు.




సీఎం కేసీఆర్‌ సంతాపం :

ప్రమాద తీవ్రత గురించి తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. మహారాష్ట్ర బస్సు ప్రమదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన తరఫున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంటల్లో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Updated : 1 July 2023 11:43 AM IST
Tags:    
Next Story
Share it
Top