Arun Yogiraj : బాల రాముని విగ్రహం చెక్కిన శిల్పికి అయోధ్య ట్రస్ట్ ప్రశంసలు
X
అయోధ్యలో ఈనెల 22న బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఇందులో భాగంగా 18న రాముని విగ్రహం అయోధ్యకు చేరుకోనుంది. అయోధ్యలో కొలువుదీరే బాలరాముని విగ్రహాన్ని కర్నాటక మైసూర్కు చెందిన ప్రసిద్ధ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. విగ్రహానికి రూపమిచ్చే సమయంలో అరుణ్ నిష్ఠకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రశంసలతో ముంచెత్తింది.
అకుంఠిత దీక్షతో బాల రాముని విగ్రహాన్ని రూపొందించాలని ట్రస్ట్ అరుణ్ కు చెప్పింది. దీంతో అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో దాదాపు 6 నెలల పాటు ఫోన్ ముట్టుకోలేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అరుణ్ దాదాపు 6 నెలల పాటు మౌనదీక్షలో ఉన్నాడు. విగ్రహం తీర్చిదిద్దే క్రమంలో ఏకాగ్రత చెదరకుండా, తన పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకే కుటుంబసభ్యులతో మాట్లాడటం అటుంచితే.. కన్న బిడ్డల ముఖాలు కూడా చూడలేదు.
విగ్రహాల తయారీతో అరుణ్ యోగిరాజ్ నిష్ణాతుడు. ఆయన పూర్వీకులు కూడా శిల్పకళా నైపుణ్యం కలిగినవారే. కేదార్‌నాథ్‌లోని శంకరాచార్యులు, ఢిల్లీ ఇండియా గేట్ వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. అరుణ్ రూపమిచ్చిన బాలరాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనుండటంపై అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజున శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ కొడుకు అరుణ్ యోగిరాజ్ గురించి చేసిన ప్రకటన ఎంతో ఆనందం కలిగించిందని అతని తల్లి సరస్వతి అన్నారు. తన కుమారుడు మైసూర్‌లోని హెగ్గదేవన్‌కోట్‌లోని కృష్ణ శిలను రామ్ లల్లా విగ్రహం చెక్కేందుకు ఎంచుకున్నాడని, ఆ రాయికి తాను పూజలు చేశానని చెప్పారు.
మరోవైపు తన భర్త చెక్కిన విగ్రహాన్ని రామ మందిరంలో ప్రతిష్టించనుండటంతో జీవితం సార్థకమైందని అరుణ్ భార్య విజేత అన్నారు. అరుణ్ ఆరు నెలలపాటు అయోధ్యలో ఉన్న సమయంలో పిల్లలను చూసుకోవడం కొంచెం కష్టంగా మారిందని చెప్పారు. అయితే ఇప్పుడు తన భర్త రూపొందించిన విగ్రహం ఎంపిక కావడం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన భర్తను అభినందించడం ఆనందంగా ఉందని అన్నారు.