Home > జాతీయం > 'పబ్జీ ప్రేమ'.. పాక్ మహిళ సీమాకు ఢిల్లీలోనూ కాంటాక్ట్స్!!

'పబ్జీ ప్రేమ'.. పాక్ మహిళ సీమాకు ఢిల్లీలోనూ కాంటాక్ట్స్!!

పబ్జీ ప్రేమ.. పాక్ మహిళ సీమాకు ఢిల్లీలోనూ కాంటాక్ట్స్!!
X

పబ్జీ ఆటలో పరిచయమైన వ్యక్తికి ప్రేమ పేరుతో దగ్గరై, అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన పాక్ మహిళ కేసులో విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన సీమా హైదర్‌ అనే మహిళ.. ఆన్ లైన్ గేమ్ లో తగిలిన యూపీ వాసీ సచిన్‌ మీనా అనే వ్యక్తిని ప్రస్తుతం పెండ్లి చేసుకొని నోయిడాలో ఉంటుంది. అయితే ఆమెది నిజంగా ప్రేమేనా?లేదా పక్కా ప్రణాళికతో ఆమె భారత్‌కు వచ్చిందా? టెర్రరిస్టులు, పాకిస్తాన్ ఆర్మీ కోసం పని చేస్తున్నదా? అని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) అనుమానిస్తున్నది. ఇప్పుడీ కోణంలోనే కేసు దర్యాప్తు చేస్తున్నది.

దుబాయ్‌ నుంచి నేపాల్‌ మీదుగా ఈ ఏడాది మేలో వీసా లేకుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్‌ను ఏటీఎస్‌ పోలీసులు ఈనెల 4న అరెస్టు చేశారు. సీమా హైదర్‌తో పాటు సచిన్‌ మీనా, అతని తండ్రిని కూడా ఓ రహస్య స్థలంలో ఉంచి ఏటీఎస్‌ పోలీసులు మంగళవారం వరుసగా రెండో రోజు ప్రశ్నించారు. అవసరమైతే, సీమా హైదర్‌ను ఏటీఎస్‌ అదుపులోకి తీసుకొనే అవకాశం కూడా ఉన్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీమా హైదర్‌ అక్రమ ప్రవేశాన్ని నిగ్గు తేల్చేందుకు యూపీ ఏటీఎస్‌తో పాటు ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) కూడా రంగంలోకి దిగింది.

ఇందులో భాగంగానే సీమా చిన్నాన్న ​తో పాటు, ఆమె సోదరుడు కూడా పాకిస్తాన్ ఆర్మీలో పని చేస్తున్నాడని వెల్లడైంది. అలాగే, భారత్‌లో ప్రవేశించిన తర్వాత సచిన్ మీనాను కలవడానికి ముందు ఢిల్లీలో ఆమె మరికొందరిని కలిసినట్టు అనుమానిస్తున్నారు. ఇక విచారణలో సీమా హైదర్.. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆచితూచి సమాధానాలు చెబుతూ.. చాలా తెలివిగా వ్యవహరిస్తున్నది. ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నట్టు చెప్పిన ఆమె ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడడం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఆమె నుంచి ముఖ్యమైన విషయాలకు సమాధానాలు రాబట్టడం అంత సులువేమీ కాదని ఏటీఎస్ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి.

Updated : 19 July 2023 10:09 AM IST
Tags:    
Next Story
Share it
Top