Home > జాతీయం > మీ పార్టీకి అంత సీన్ ఉండదని జేపీకి అప్పుడే చెప్పా - బుద్ధా మురళి

మీ పార్టీకి అంత సీన్ ఉండదని జేపీకి అప్పుడే చెప్పా - బుద్ధా మురళి

మీ పార్టీకి అంత సీన్ ఉండదని జేపీకి అప్పుడే చెప్పా - బుద్ధా మురళి
X

తెలంగాణకు అదేం దురదృష్టమో కానీ... మీకు చీకటి తప్పదు అని జోస్యం చెప్పిన వారి కళ్లు వెలుగులతో మూసుకుపోయేంతగా అభివృద్ధి సాధించిన వారు తెలంగాణ గురించి చెప్పే మాటలకన్నా.. జీవితంలో ఒక్కసారి గెలిచి అడ్రస్ లేకుండా పోయిన వారి మాటలకే తెలుగు మీడియా ప్రాధాన్యత ఇస్తుంది. తెలంగాణలో మిగులు విద్యుత్ సాధించే దశకు చేరుకుంటామని ప్రకటిస్తే మేధావులు నవ్వారు. 6 నెలల్లో ఆంధ్రాలో కలిపేయమని ఉద్యమం తెలంగాణలో వస్తుంది చూడండి అని జోష్యం చెప్పారు. బోరు బావులకు విద్యుత్ లేక కరువుతో పోతారని అన్నారు . ఆ మేధావుల్లోని ఒకరైన జయప్రకాశ్ నారాయణ మెట్రో గురించి మరో జోస్యం చెప్పారు.

మెట్రో గురించి ఇది మొదటి జోస్యం ఏమీ కాదు. వారి ఆలోచన ధోరణికి చెందిన జ్యోతి పత్రిక, ప్రపంచంలో టాప్ యువ నాయకుడిగా అవార్డు పొందిన నారా లోకేష్ మెట్రో పై గతంలోనే జోస్యాలు చెప్పారు. హైదరాబాద్ లో మెట్రో మొదలు కాలేదు కానీ మేం విజయవాడలో ప్రారంభించాం అని నారా లోకేష్ బహుశా 2016లో ట్విట్ చేశారు . హైదరాబాద్ మెట్రో పరుగులు తీస్తోంది . విజయవాడ మెట్రో లోకేష్ లాంటి ప్రపంచ స్థాయి నాయకులకు తప్ప సామాన్యులకు కనిపించడం లేదు. హైదరాబాద్ మెట్రో లాభసాటి కాదు , నిర్మించరు , వెనక్కి వెళతారు అని జ్యోతి అనేకసార్లు రాసింది. మీడియా అంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మెట్రోనేమో పరుగులు తీస్తోంది .ఇప్పుడు నగరానికి నాలుగు వైపులా మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు. మెట్రోపై జేపీ కొత్త జోస్యం చెప్పాక.. గతంలో నేను ఆయనకు చెప్పిన జోస్యం గుర్తుకు వచ్చింది .

ప్రతి రోజు ఏ బీట్ రిపోర్టర్ అయినా సచివాలయంలో ప్రెస్ రూం బయట, చెట్టు కింద కాసేపు కబుర్లు చెప్పుకొనే అలవాటు ఉండేది . 2006లో ఓ రోజు నేను అలా ప్రెస్ రూమ్ వద్దకు వెళుతుంటే కొందరు జర్నలిస్టులు అక్కడ సీరియస్ గా చర్చిస్తున్నారు . కొమ్మినేని శ్రీనివాస్ , భార్గవ్ , యాదగిరిరెడ్డి ( గుర్తున్న పేర్లు ) ఇంకా కొంత మంది మధ్య సీరియస్ చర్చ జరుగుతోంది. జయప్రకాశ్ నారాయణ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాడు అనేది ఆ చర్చ అంశం . అప్పటికి నియోజకవర్గాల పునర్విభజన అమల్లోకి రాలేదు . అప్పుడు కూకట్పల్లి ప్రాంతం ఖైరతాబాద్ నియోజక వర్గంలో ఉంది. కూకట్ పల్లి ప్రాంతం ఏ నియోజక వర్గం పరిధిలోకి వస్తుందో అక్కడ పోటీ చేస్తే జేపీ ఒక్కరు గెలుస్తారు. అంతకు మించి ఆయన పార్టీకి అంత సీన్ ఉండదని జోస్యం చెప్పాను . అంత నెగిటివ్ ఎందుకు? ఏమో జేపీ పార్టీ భవిష్యత్తు బాగుండొచ్చు ఇప్పుడే ఎలా చెప్పగలం అని కొమ్మినేని తన అభిప్రాయం చెప్పారు . లోక్ సత్తా పేరుతో జెపి అంతకు ముందు నుంచే వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహించేవారు. కూకట్ పల్లి ప్రాంతంలో లోక్ సత్తా సంస్థ సభ్యులు బలంగా ఉండేవారు . మున్సిపాలిటీ వాళ్లు లంచం తీసుకుంటే నోట్ల నంబర్ లు అన్నీ ఏసుకొని వారి బండారం బయట పెట్టి, తిరిగి ఆ డబ్బును వెనక్కి తీసుకోవడం అప్పుడో సంచలనం . స్థానిక సంస్థలకు అధికారాలు వంటి అంశాలపై లోక్ సత్తా బాగానే పని చేసింది. ఆ ప్రచారంతో దాన్ని రాజకీయ పార్టీగా మార్చాలి అని జేపీ నిర్ణయించుకున్నారు .

చంద్రబాబు విఫలం కావడంతో బాబుకు ప్రత్యామ్నాయంగా జేపీని రామోజీరావు తెరపైకి తీసుకువచ్చారని అప్పుడు బలంగా ప్రచారం ఉండేది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే ఈనాడులో టీడీపీ తరువాత జేపీకి అంత ప్రచారం లభించేది. జేపీ అందరు ఎడిటర్లకు ఫోన్ చేసి సీనియర్ జర్నలిస్ట్ లను పంపండి అని కోరేవారు. ఈనాడు మంచి ప్రచారం ఇస్తున్నప్పుడు సాధారణంగా అన్ని పత్రికలు ఈనాడును తోకలా అనుసరిస్తాయి. బాబుకు ప్రత్యామ్నాయంగా జేపీని రామోజీ రంగంలోకి దించారు అనే దానిపై నాకు పెద్దగా నమ్మకం లేదు కానీ ఈనాడులో జేపీకి మంచి ప్రచారం లభించేది. టీడీపీని తీవ్రంగా అభిమానించే వర్గాలు టీడీపీతో పాటు జేపీని అభిమానించేవి .

బిర్లా టెంపుల్ నౌబత్ పహాడ్ వద్ద జేపీ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. శుభమ్ పలకరా అంటే ఏదో అన్నట్టు ఆ రోజే జేపీకి ఆయన రాజకీయ భవిష్యత్తు చెప్పాను. మీరు సాంప్రదాయ రాజకీయాలకు వ్యతిరేకం అని చెబుతున్నారు ( కులం , ప్రాంతం, వంటివి సాంప్రదాయ రాజకీయాలు అనేది జేపీ భావన ) కానీ మీరు కూడా సాంప్రదాయ రాజకీయ ఎత్తుగడతోనే గెలిచారు. మీరు ప్రస్తుతం నివాసం ఉంటున్న నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి, లేదా మీరు పుట్టిన ప్రాంతం నియోజక వర్గం నుంచి పోటీ చేయాలి కానీ ఈ రెండు కాకుండా కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్నారంటే మీరు కూడా సాంప్రదాయ రాజకీయాలు చేస్తున్నట్టే . కూకట్ పల్లిలో ఆంధ్ర ప్రాంతం వారు, మీ సామాజిక వర్గం వారు ఎక్కువ మంది ఉన్నారనే కదా అక్కడి నుంచి పోటీ. ఇది సాంప్రదాయ రాజకీయం కాకపోతే మరేమిటి అని అడిగాను. ఐతే కూకట్ పల్లి నుంచి పోటీ చేయాలి అనేది తెలివైన నిర్ణయం. ఇదే వ్యూహం తో 2018 లో టీడీపీ నందమూరి సుహాసినిని కూకట్ పల్లి నుంచి పోటీ చేయించారు. నిజంగానే సాంప్రదాయ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ఇంకో చోట నిలబడితే మొదటికే మోసం వచ్చేది . మీ పార్టీ నిలబడదు మీరొక్కరే తప్ప ఇంకొకరు గెలువరు అని ఆయనకే జోస్యం చెప్పాను. మీరు ప్రజలను అర్థం చేసుకోవడం లేదు.. మా పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్పుకొచ్చారు. రెండో సారి కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తే ఏమవుతుందో తెలిసి జేపీ రెండో సారి ఆ సాహసం చేయలేదు . 2014లో తిరిగి అదే వ్యూహంతో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గంపై గురి పెట్టారు . బీజేపీని బాబును ఆకాశానికెత్తారు . పొత్తులో మల్కాజిగిరి టికెట్ ఆశించారు. సొంతంగా పోటీ చేసి పార్లమెంట్లో ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం పోరాడుతాను అని బహిరంగంగా ప్రకటించారు . అయినా ఓటర్లు పట్టించుకోలేదు.

జేపీని టీడీపీ మీడియా , టీడీపీ వర్గమే ఆకాశానికెత్తింది. కానీ జేపీ తమ కొంప ముంచుతున్నాడని ఎన్నికల తరువాత గ్రహించింది. 2009 ఎన్నికల్లో లోక్ సత్తాకు దాదాపు 2 శాతం ఓట్లు వచ్చాయి . అవన్నీ టీడీపీని అభిమానించే వారివే అని టీడీపీ భావించింది . మీరు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అని సామెత చెప్పినట్టు జేపీకి మనవాళ్లే ప్రచారం కల్పిస్తే మన కొంపనే కొల్లేరు చేస్తున్నాడని టీడీపీ జేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది . లోక్ సత్తాకు విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో బయటపెట్టాలని యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ భవన్ లో రోజూ విలేకరుల సమావేశాలు పెట్టి తీవ్రంగా దాడి చేశారు . యనమల ఆరోపణలకు జేపీ స్పష్టమైన సమాధానం చెప్పలేదు .

పార్టీ పెట్టినప్పుడే మీ వల్ల కాదని ఆ మేధావికి జోస్యం చెప్పాను.. 2014 తరువాత ఔను నా వల్ల కాదు అని జేపీ గ్రహించి పార్టీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మీరెలా రద్దు చేస్తారు అని కొందరు తిరగబడ్డారు. దాంతో మీరు నడుపుకోండంటూ జేపీ చెప్పారు . ఇంతకూ జేపీ పార్టీ ఉందా ? లేదా ? అంటే ఏమో జేపీకే తెలియదు.. నాకెలా తెలుస్తుంది .? తెలంగాణ ఏర్పాటును చివరి వరకు వ్యతిరేకించిన జేపీ, చివరలో హైదరాబాద్ ఆదాయాన్ని ఆంధ్రకు కేటాయించాలి అని డిమాండ్ చేశారు . తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించడం వేరు కానీ ఒక రాష్ట్రంలో వచ్చిన ఆదాయం ఇంకో రాష్ట్రానికి ఇవ్వాలి అని డిమాండ్ చేయడం అదేం మేధావితనమో. - బుద్దా మురళి

Updated : 4 Aug 2023 12:22 PM GMT
Tags:    
Next Story
Share it
Top