మరో ఎదురుదెబ్బ.. శరద్ పవార్కు షాకిచ్చిన నాగాలాండ్ ఎమ్మెల్యేలు..
X
ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు మరో షాక్ తగిలింది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. శరద్ పవార్ ను కాదని అజిత్ పవార్‌కు మద్దతు తెలిపారు. ‘నాగాలాండ్‌కు చెందిన పార్టీ నేతలంతా అజిత్ పవార్‌కు మద్దతు తెలుపుతున్నాం’ అని ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రకటన విడుదల చేశారు.
జూలై 2న ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ 30-35 మంది ఎమ్మెల్యేలతో సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరారు. అందుకు ప్రతిఫలంగా అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం, మరో 8 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. అయితే తిరుగుబాటు అనంతరం కూడా అజిత్.. శరద్ పవార్‌తో రెండుసార్లు భేటీ అయ్యారు. తన వర్గం నేతలతో కలిసి ముంబయిలోని శరద్ పవార్ నివాసానికి చేరుకొని, పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై ఆయనతో చర్చించారు. తమ విజ్ఞప్తిని విన్న శరద్ పవార్.. మౌనంగా ఉన్నారే తప్ప ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని రెబల్ ఎమ్మెల్యేలు చెప్పారు.