Home > జాతీయం > కమాండోలపై మిలిటెంట్ల దాడి.. మణిపూర్లో మరోసారి ఉద్రిక్తత

కమాండోలపై మిలిటెంట్ల దాడి.. మణిపూర్లో మరోసారి ఉద్రిక్తత

కమాండోలపై మిలిటెంట్ల దాడి.. మణిపూర్లో మరోసారి ఉద్రిక్తత
X

మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మయన్మార్‌ సరిహద్దుల్లోని మోరేలో రెచ్చిపోయిన మిలిటెంట్లు.. పోలీసు కమాండోలపై మెరుపుదాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు పోలీసు కమాండోలు, ముగ్గురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో కలిపి మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఎయిర్ అంబులెన్సులో ఇంఫాల్‌ హాస్పిటల్కు తరలించారు. గాయపడిన కమాండోలు, జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

జనవరి 1న మణిపూర్‌లో పౌరులపై దుండగులు కాల్పులు జరిపిన మరుసటి రోజే.. భద్రతా దళాలపై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో థౌబాల్‌ జిల్లాలో భద్రతా బలగాల యూనిఫాంను పోలిన దుస్తులు ధరించిన దుండగులు.. పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. వాహనాలను తగులబెట్టారు. దీంతో రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ వాతావరణం నేపథ్యంలో థౌబాల్‌, ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ, కాక్చింగ్‌, బిష్ణుపూర్‌ జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

గతేడాది మణిపూర్‌లో చెలరేగిన హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో పలు జిల్లాల్లో నెలల తరబడి ఆంక్షలు విధించారు. ఆ ప్రభావం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే శాంతియుత పరిస్థితులు నెలకొంటున్న సమయంలో మరోసారి హింస చెలరేగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 2 Jan 2024 2:41 PM IST
Tags:    
Next Story
Share it
Top