ఇండియా కూటమి అభ్యర్థిగా ఖర్గే.. ప్రతిపాదించిన పలువురు నేతలు
X
ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు ఇండియా కూటమి సిద్ధమైంది. కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేని ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమిలోని పలు పార్టీల నాయకులు ఆయన పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే అలాంటి ప్రకటన ఇప్పుడే చేయవద్దని ఖర్గే వారించినట్లు తెలుస్తోంది. సమిష్టిగా పోరాటం చేద్దామని, ప్రధాని ఎవరన్న దానిపై తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అశోక హోటల్లో నిర్వహించిన 4వ భేటీలో ఇండియా కూటమి నేతలు దాదాపు 3 గంటల పాటు చర్చించారు.
ఇదిలా ఉంటే 142 మంది ఎంపీల సస్పెన్షన్ను ఇండియా కూటమి తీవ్రంగా ఖండించింది. స్పీకర్ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 22న దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని నిర్ణయించింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంటుకు రాకుండా ప్రధాని మోడీ తప్పించుకుంటున్నారన్న ఖర్గే.. బీజేపీ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.