Kamal Nath : బీజేపీలోకి కమల్ నాథ్..?.. ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
X
మధ్యప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ సీఎం కమల్నాథ్ హస్తం పార్టీకి హ్యాండిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కమల్నాథ్ తన కొడుకు, ఎంపీ నకుల్నాథ్తో కలిసి బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు మద్ధతుగా పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. కమల్ నాథ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. తమ మద్ధతు ఆయనకే అని సదరు ఎమ్మెల్యేలు చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ కమల్ నాథ్ పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద షాకే అని చెప్పొచ్చు.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాత్రం కమల్ నాథ్ పార్టీని వీడరు అని చెబుతున్నారు. ఈడీ, సీబీఐ దాడులకు భయపడి ఆయన పార్టీ మారే వ్యక్తి కాదని చెబుతున్నారు. కాంగ్రెస్ ఆయనకు అన్ని రకాల పదవులను ఇచ్చిందని.. అటువంటి వ్యక్తి పార్టీని ఎలా వీడుతారని వ్యాఖ్యానించారు. కాగా పార్టీలో చేరికపై బీజేపీ పెద్దలతో చర్చించేందుకే ఆయన హస్తినకు వెళ్లారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కొందరు రిపోర్టర్లు ఆయన వద్ద ప్రస్తావించగా.. పార్టీ మార్పుపై తనకన్నా మీడియానే ఎక్కువ ఆసక్తి చూపుతోందని సెటైర్ వేశారు. ఒకవేళ తాను బీజేపీలో చేరితే ముందుగా ఆ విషయం మీడియాకే చెప్తానని చెప్పారు.
ఇదిలా ఉంటే కమల్నాథ్ ఢిల్లీ చేరుకున్న వెంటనే ఆయన కుమారుడు నకుల్ నాథ్ తన సోషల్ మీడియా అకౌంట్లలో మార్పు చేయడం పార్టీ మార్పు ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది. నకుల్నాథ్ ట్విట్టర్ హ్యాండిల్లో కాంగ్రెస్ పదం తొలగించడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఎంపీగా మధ్యప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నకుల్ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తన తండ్రి సొంత నియోజకవర్గమైన చింద్వారా నుంచి బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. ఈసారి కమల్నాథ్ ఎన్నికల్లో పోటీ చేయరని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం నకుల్ అభ్యర్థిత్వానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.