Consecration Ceremony: పాత విగ్రహం ఉండగా.. మళ్లీ కొత్తది ఎందుకు.?.. శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
X
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సన్నాహాలు మొదలయ్యాయి. గురువారం నాడు శ్రీరామనామ స్మరణ, వేద మంత్రోచ్ఛారణ మధ్య బాల రాముడి విగ్రహాన్ని ఆలయం గర్భగుడిలోకి చేర్చారు. ఈ నెల 22న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగనున్నది. అయితే ఈ కార్యక్రమంపై పలువురు హైందవ వాదులు, బ్రాహ్మణ సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తు్న్నాయి. తాజాగా శంకరాచార్య అవిముక్తేశ్వరానంద.. ఆలయ ట్రస్టుకు లేఖ రాస్తూ.. అయోధ్యలో ఇప్పటికే రాముడి పాత విగ్రహం ఉండగా, మళ్లీ కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిన అవసరం ఏమొచ్చిందని అందులో పేర్కొన్నారు. అక్కడ ముందు నుంచే విగ్రహం ఉందనడానికి ఓ ముస్లిం వాచ్‌మన్ సాక్షిగా కూడా ఉన్నట్లు తెలిపారు.
అంతేకాకుండా.. ఇటీవల జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అసంపూర్ణంగా నిర్మించిన ఆలయంలో.. సంపూర్ణ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే.. అది కేవలం విగ్రహం మాదిరిగానే ఉంటుంది కానీ.. అందులో దైవత్వం ఉండదన్నారు. ప్రస్తుతం గర్భగుడిగా చెబుతున్న ఆ ఆలయానికి పైన శిఖరం, కలశం లేదని లేదని విమర్శించారు. పరమాత్ముని దేహమే దేవాలయంగా.. ఆలయ శిఖరం దేవుని కన్నులుగా, శిఖరంపై ఉండే కలశాన్ని తలగా, దానిపై ఉండే ధ్వజపతాకాన్ని శిరోజాలుగానూ భావిస్తారని... వీటి కిందే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. కానీ, ఇప్పటివరకూ ఆలయం మొండెం వరకే పూర్తయింది. కనుక ఆ మొండెంలో ప్రాణప్రతిష్ఠ చేస్తే అప్పుడదో నాసిరకమైన భాగమవుతుందన్నారు. శిఖరము, ధ్వజము లేకుండా ప్రాణప్రతిష్ఠ చేస్తే, అక్కడ రామ విగ్రహం కనిపించవచ్చేమో కానీ, అందులో దైవిక శక్తి ఉండదని.. అసురశక్తులు అక్కడ తిష్ఠవేస్తాయని చెప్పుకొచ్చారు.
మరోవైపు ఇటువంటి వాదనలపై విహెచ్‌పి ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ స్పందిస్తూ.. ఆలయం అసంపూర్తిగా ఉందన్న ఆరోపణలను నిజం కాదని, బాలరాముడి(రామ్ లల్లా) విగ్రహం.. గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రతిష్ఠించబోతున్నామని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం అంతా పూర్తయిందని... దీనిపై ముగ్గురు శంకరాచార్యులు ఆలయ నిర్మాణం పూర్తయినందుకు సంతోషం వ్యక్తం చేసి ప్రాణప్రతిష్ఠకు స్వాగతం పలికారన్నారు.