Modi : అంతా ఆయనే.. అన్నింటా ఆయనేనా.. మోడీపై మఠాధిపతుల ఆగ్రహం
X
వ్యక్తి పూజకు వ్యతిరేకం.. ఇదీ బీజేపీ చెప్పే మాట. దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కూడా వ్యక్తులు ముఖ్యం కాదు.. వ్యవస్థ ప్రధానం అంటుంది. వ్యక్తులు వ్యవస్థను శాసించే పరిస్థితి ఉండకూడదని చెబుతుంది. కానీ గత పదేండ్లుగా జరుగుతున్నది మాత్రం పూర్తి వ్యతిరేకం. కేంద్రంలోనూ పలు రాష్ట్రాల్లోనూ ఒకే నినాదం వినిపిస్తోంది. మోడీ భజనే కనిపిస్తోంది. అంతా మోడీ.. అన్నింటా మోడీ.. ఎటు చూసినా మోడీ.. రాజకీయాలే కాదు.. చివరకు రామ మందిర నిర్మాణం, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ విషయంలోనూ మోడీ పేరే మార్మోగుతోంది. మోడీ లేకపోతే రామ మందిర నిర్మాణమే లేదన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రామ మందిర ప్రారంభం హిందువులందరి పండుగ కాదు.. మోడీ, బీజేపీ పార్టీ నిర్వహిస్తున్న పండగ అన్నట్లుగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనవరి 22న అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఆ రోజు కోసం లక్షలాది మంది వేచి చూస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా, కన్నుల పండువలా జరిపేందుకు శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. వారణాసికి చెందిన పూజారి పండిత్ లక్ష్మీ కాంత్ దీక్షిత్ ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ క్రతువు నిర్వహించనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. హిందుత్వ గురించి గొప్పగా చెప్పుకునే బీజేపీ, ప్రధాని మోడీ.. మాటల్లో తప్ప ఆచరణలో మాత్రం దాన్ని చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి స్వాములు, సాధువులు, మఠాధిపతులను ఆహ్వానించకపోవడం, కార్యక్రమంలో వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. గతంలో చిన్న చిన్న ఉత్సవాలకు సైతం ఆహ్వానం పంపిన బీజేపీ.. ఇప్పుడు రాముని ప్రాణ ప్రతిష్ఠకు పిలవకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయోధ్య రామాలయ విషయంలో ప్రధాని మోడీ వైఖరిని మఠాధిపతులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి మతపరమైన కార్యక్రమాల్లో అన్నీ తానే.. అంతా తానే అన్నట్లు వ్యవహరించడంపై మండిపడుతున్నారు. ఆ కారణంగానే అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావడం లేదని పూరీలోని గోవిందన్ మఠాధిపతి పూరీ శంకరాచార్య ప్రకటించారు. మోడీ రామయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రాణ ప్రతిష్ఠ క్రతువు నిర్వహిస్తున్నప్పుడు తాము అక్కడికి వెళ్లి ఏం చేయాలని, మోడీ విగ్రహ ప్రతిష్ట చేస్తుంటే చప్పట్లు కొడుతూ పక్కన నిలబడాలా అని ప్రశ్నిస్తున్నారు. సాధు సంతువులు, మఠాధిపతులను పక్కన బెట్టి మోడీ ఈ క్రతువు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పూరీ శంకరాచార్య ఇప్పటికే ఓ వీడియో రిలీజ్ చేశారు.
పూరీ శంకరాచార్య మాత్రమే కాదు.. మిగిలిన మూడు మఠాధిపతులు సైతం రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. రామాలయ నిర్మాణ పనులు కొనసాగుతుండగానే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయడం శాస్త్రాలకు విరుద్ధమని ఉత్తరాఖండ్లోని జ్యోతిర్ మఠాధిపతి అవిముక్తేశ్వరానంద సరస్వతి అంటున్నారు. శాస్త్రాలను ఆచరించడం, ఆచరించేలా చేయడం తమ విధి అని అయితే అయోధ్యలో వాటిని పాటించనప్పుడు తాము అక్కడకు వెళ్లి ఏం చేస్తామని అంటున్నారు. శాస్త్రాలు, సంప్రదాయాలు పాటించకుండా నిర్వహించే కార్యక్రమాల్లో మఠాధిపతులెవరూ భాగస్వాములుకారని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే అయోధ్యలోని ఆశ్రమాలను నిర్వహించే సాధువులకు సైతం రామాలయ ప్రారంభానికి ఆహ్వానించకలేదు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తమకు ఆహ్వానం అందుతుందని ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురైంది. రామ మందిర నిర్మాణం కోసం ఏండ్లుగా కండ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నామని అయినా మోడీ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామ మందిర నిర్మాణంలో ప్రధాని నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలకపాత్ర పోషించినా.. అన్నీ తామే అయినట్లు వ్యవహరిస్తూ స్వాములు, సాధువులను పక్కన పెట్టడాన్ని తప్పుబడుతున్నారు.
మరోవైపు అయోధ్యలో భక్తుల రాక ఇప్పటికే మొదలైంది. రామయ్య దర్శనం కోసం దేశవిదేశాల నుంచి వేలాది మంది తరలివస్తున్నారు. దీంతో అయోధ్యలోని స్థానిక ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే చాలా మంది భక్తుల నుదిటిన జై శ్రీరాం అని రాసిన రిబ్బన్లు కట్టుకుని.. చేతిలో బీజేపీ జెండాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ జెండాలు ఎందుకుని ప్రశ్నిస్తే.. ఇంత అద్భుతమైన రామాలయాన్ని కట్టించింది మోడీ, యోగి ఆదిత్యనాథ్ అయినప్పుడు బీజేపీ జెండా మోయడంలో తప్పులేదు కదా అనే సమాధానమే వినిపిస్తోంది. అంతేకాదు భక్తి పాటలు, భజనల్లోనూ మోడీ పేరే మార్మోగుతోంది. ఆధునిక భారత సాధువు అంటూ మోడీని ప్రశంసిస్తూ భజనలు,కీర్తనలు వినిపిస్తుండటం విశేషం.