వింత వ్యాధి.. కడుపులో ఉన్న వస్తువులు చూసి డాక్టర్లు షాక్..
X
పుదుచ్చేరిలో వింత ఘటన చోటు చేసుకుంది. కడుపునొప్పితో బాధపడుతున్న 20ఏండ్ల యువకుడికి స్కానింగ్ చేసిన డాక్టర్లు కడుపులో ఉన్న వస్తువులు చూసి షాకయ్యారు. వెంటనే సర్జరీ చేసి వాటిని తొలగించారు. దీంతో సదరు యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
పుదుచ్చేరికి చెందిన 20 ఏండ్ల యువకుడు కడుపునొప్పి, రక్తపు వాంతులు అవుతుండటంతో ఆగస్టు 7న గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ మెడికల్ సెంటర్ హాస్పిటల్ లో చేరాడు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు కొన్ని టెస్టులు చేశారు. ఎండోస్కోపిక్ స్కాన్ లో అతని కడుపులో కొన్ని ఇనుప పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. సర్జరీ చేయాలని చెప్పారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శశికుమార్ నేతృత్వంలో వైద్యుల బృందం దాదాపు రెండు గంటల పాటు ఎండోస్కోపిక్ సర్జరీ చేసి అతని కడుపులో ఉన్న వస్తువులు బయటకు తీశారు.
కడుపులో ఉన్న వస్తువులు చూసి డాక్టర్లు షాకయ్యారు. యువకుడి కడుపు నుంచి 13 హెయిర్ పిన్ లు, 5 సేఫ్టీ పిన్ లు, 5 రేజర్ బ్లేడ్ బయటకు తీశారు. ఆగస్టు 8న సర్జరీ నిర్వహించగా తాజాగా ఆ యువకుడు కోలుకున్నాడు. మానసిక సమస్యల కారణంగానే ఆ యువకుడు తనకు తెలియకుండానే వాటిని మింగేశాడని డాక్టర్లు చెబుతున్నారు. బాల్యం నుంచి ఫిట్స్ తో బాధపడుతున్న పేషెంట్ కు తాను తినే ఆహారంలో వాటిని కలుపుకొని తిని ఉంటాడని అంటున్నారు. అయితే అంత పదునైన వస్తువులను మింగినా అదృష్టవశాత్తూ అంతర్గత అవయవాలకు ఎలాంటి హానీ కలగలేదని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆ యువకుడికి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు.