బెంగళూరులో తెలంగాణ అమ్మాయి దారుణ హత్య
X
బెంగళూరులో తెలంగాణకు చెందిన ఓ యువతి దారుణ హత్యకు గురైంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఆకాంక్షను ఆమె ప్రియుడే అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది. మంగళవారం హత్యకు గురైన ఆకాంక్ష మృతదేహం ప్రస్తుతం స్వస్థలానికి చేరుకుంది. కాసేపట్లో ఆకాంక్ష కుటుంబ సభ్యులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేయనున్నారు.
రాజస్థాన్ నుంచి గోదావరిఖనికి ఆకాంక్ష కుటుంబం వలస వచ్చింది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆకాంక్ష ప్రస్తుతం బెంగళూరులో ఉంటోంది. అయితే మంగళవారం ఉదయం తన ఫ్లాట్‌లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది ఆకాంక్ష. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆకాంక్షది హత్యగా నిర్దారించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆకాంక్ష బాయ్ ఫ్రెండ్ అర్పిత్ ఆమెను చంపాడని బెంగళూరు పోలీసులు తెలిపారు.
గతంలో ఆకాంక్ష ఢిల్లీలో జాబ్ చేసేది. అక్కడే తన తోటి ఉద్యోగి అర్పిత్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారు. ఈ క్రమంలోనే వేరే జాబ్ రావడంతో ఆకాంక్ష ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చింది. ఆమెను కలిసేందుకు అర్పిత్ తరచుగా బెంగళూరు వస్తుండేవాడు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు ఆమెను మంగళవారం హత్య చేసి అర్పిత్ పరారయ్యాడని తెలుస్తోంది.
హత్య చేసిన అనంతరం అర్పిత్ ఆకాంక్ష మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసి సూసైడ్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు . కానీ అది సాధ్యం కాకపోవడంతో ఆమె డెడ్ బాడీని అక్కడే వదిలేసి ఇంటి తలుపులు మూసి అక్కడి నుంచి పారిపోయాడు.