Home > జాతీయం > జులై 1 నుంచి ఫ్రీ కరెంట్.. 5 హామీల అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

జులై 1 నుంచి ఫ్రీ కరెంట్.. 5 హామీల అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

జులై 1 నుంచి ఫ్రీ కరెంట్.. 5 హామీల అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
X

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 5 హామీల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో శుక్రవారం భేటీ అయిన కర్నాటక కేబినెట్‌ ఈ పథకాల అమలుకు పచ్చజెండా ఊపింది. అధికారుల ప్రజెంటేషన్ అనంతరం మంత్రులతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే 5 గ్యారెంటీ స్కీంలు అమలుచేయనున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు.

కుల, మత వివక్ష లేకుండా ఐదు హామీలను అమలుచేయాలని కేబినెట్లో నిర్ణయించినట్లు సిద్ధరామయ్య చెప్పారు. ప్రజలకిచ్చిన ఇతర హామీలను కూడా కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. 5 గ్యారెంటీ పథకాల అమలుకు ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.50,000 కోట్ల భారం పడనుంది. కేబినెట్ నిర్ణయం మేరకు గృహ జ్యోతి పథకం కింద ప్రతి ఇంటికీ నెలనెలా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, గృహలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి చెందిన మహిళకు నెలకు రూ.2000 అందించనున్నారు. అన్న భాగ్య స్కీం కింద ప్రతి బీపీఎల్ కుటుంబానికి 10కిలోల ఉచిత బియ్యం, యువనిధి కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్ కు నెలకు రూ.3వేలు, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్ కు రూ. 1500 చొప్పున భృతి ఇవ్వనున్నారు. 18 నుంచి 25 ఏండ్ల వయసున్న వారికి రెండేళ్ల పాటు ఈ మొత్తం అందించనున్నారు. ఇక శక్తి పథకం కింద కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించనున్నారు.

ఫ్రీ కరెంటు పథకం జులై 1 నుంచి అమల్లోకి వస్తుందని సిద్ధరామయ్య ప్రకటించారు. అప్పటి వరకు వినియోగించే కరెంటుకు ఛార్జీలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 5 వాగ్దానాలను ఒకేసారి నెరవేర్చుతామని ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 224 స్థానాలున్న అసెంబ్లీలో 135 స్థానాల్లో గెలిచిన ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఇచ్చిన మాట ప్రకారం కేబినెట్‌ భేటీలో 5 హామీల అమలుకు ఆమోదముద్ర వేసింది.



Updated : 2 Jun 2023 5:38 PM IST
Tags:    
Next Story
Share it
Top