Home > జాతీయం > మహిళా ఉద్యోగులకు సీఎం గుడ్‌న్యూస్.. ఏడాది పాటు ప్రసూతి సెలవులు

మహిళా ఉద్యోగులకు సీఎం గుడ్‌న్యూస్.. ఏడాది పాటు ప్రసూతి సెలవులు

మహిళా ఉద్యోగులకు సీఎం గుడ్‌న్యూస్.. ఏడాది పాటు ప్రసూతి సెలవులు
X

ప్రభుత్వ ఉద్యోగులకు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ శుభవార్త తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు 12 నెలల ప్రసూతి సెలవులు, ఒక నెల పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్టు తెలిపారు. బుధవారం జరిగిన సిక్కిం స్టేట్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఎస్‌ఎస్‌సీఎస్‌ఓఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో సీఎం ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సెలవులతో ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలు, కుటుంబాలను మరింత మెరుగ్గా చూసుకోవడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు.మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం.. ఉద్యోగం చేసే మహిళకు ఆరు నెలలు లేదా 26 వారాలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు.

దేశంలోనే అత్యంత తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం సిక్కిం. అక్కడ జనాభా కేవలం 6.32 లక్షలు మాత్రమే. రాష్ట్ర పరిపాలనకు అధికారులు వెన్నెముక అని.. సిక్కిం రాష్ట్రం, దాని ప్రజల అభివృద్ధికి వారు గణనీయంగా దోహదపడుతున్నారని సీఎం తమాంగ్ అన్నారు. సివిల్ సర్వీసెస్ అధికారులకు పదోన్నతుల ప్రక్రియను క్రమబద్ధీకరించడంపై దృష్టి సారించామని, దీనివల్ల పదోన్నతుల సంఖ్య పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా చేరిన ఐఏఎస్, SCS (సిక్కిం సివిల్ సర్వీసెస్) అధికారులందరినీ ఆయన అభినందించారు. వారి కెరీర్ విజయవంతంగా సాగాలని సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం మన దేశంలో ప్రసూతి సెలవు 180 రోజుల వరకు లభిస్తుంది. అయితే ఇద్దరు లేదా అంతకన్నా తక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులకే ఈ సదుపాయం పరిమితం.. పురుషుల విషయానికి వస్తే 15 రోజుల వరకూ పితృత్వ సెలవులు ఉంటాయి. సిక్కిం ప్రభుత్వం ఈ రెండు సెలవులను రెట్టింపు చేయబోతుంది.

Updated : 27 July 2023 11:57 AM IST
Tags:    
Next Story
Share it
Top