Shabnam Shaikh: రాముడిపై ముస్లిం యువతి భక్తి.. 1425 కిలోమీటర్ల పాదయాత్ర
X
అయోధ్య రామ మందిరంలో జరిగే చారిత్రక ప్రాణప్రతిష్ఠ క్రతువును ప్రత్యక్షంగా వీక్షించేందుకు కొంతమంది సాహసయాత్రలు చేస్తున్నారు. కాలినడకన కొందరు, సైకిల్ తొక్కుతూ మరికొందరు, స్కేటింగ్ చేస్తూ ఇంకొందరు.. మార్గాలు వేర్వేరు కావొచ్చు- కానీ వారందరి లక్ష్యాలు ఒక్కటే. అయోధ్యకు ఎలాగైనా వెళ్లాలని, చారిత్రక ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించాలని ఇలా ఎంతో మంది సాహసయాత్రకు పూనుకున్నారు. ఇతర మతాలకు చెందిన వారు సైతం సాహసయాత్రలు చేస్తుండటం విశేషం.
ముంబైకి చెందిన షబ్నమ్ అనే ముస్లిం యువతి.. తన స్నేహితులైన రామన్‌రాజ్ శర్మ, వినీత్ పాండేతో కలిసి ముంబై నుంచి తన పాదయాత్రగా అయోధ్యకు చేరుకుంది. హిందూ- ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా, మతసామరస్యాన్ని ప్రోత్సహించే విధంగా ముంబయి నుంచి అయోధ్యకు పాదయాత్ర చేపట్టింది షబ్నాం షేక్. రాముడి జెండాలు చేతబట్టి 1400 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు కాలి నడకనే వెళ్తోంది. మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ రోజుకు 60 కిలోమీటర్లు నడుస్తోంది షబ్నాం. భుజంపై కాషాయ జెండా, వీపుపై అయోధ్య రామ మందిరం ఫోటో, ఒంటిపై హిజాబ్ ధరించిన షబ్నమ్‌ను చూసి.. చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఆమెతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.'ఎక్కడికి వెళ్లినా నాకు అందరూ ఘనంగా స్వాగతం పలుకుతున్నారు' అని చెబుతోంది షబ్నాం.
బిహార్‌కు చెందిన నితీశ్ కుమార్(21) తన స్వస్థలం మాధేపుర నుంచి అయోధ్యకు సైక్లింగ్ ద్వారా చేరుకున్నాడు. 615 కిలోమీటర్లు సైకిల్ తొక్కి శుక్రవారం రామ జన్మభూమిపై కాలుమోపాడు. సైకిల్‌కు ఓ జాతీయ జెండా, మూడు కాషాయ జెండాలు పెట్టుకొని ప్రయాణం చేశాడు . జైశ్రీరామ్ నినాదం రాసి ఉన్న ప్లకార్డును సైకిల్‌కు తగిలించి రాఘవుడిని తలుచుకుంటూ ప్రయాణం సాగించాడు. వారణాసికి చెందిన సోనీ చౌరాసియా స్కేటింగ్ చేస్తూ అయోధ్యకు పయనమైంది. 124 గంటల పాటు డ్యాన్స్ మారథాన్ చేసి గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించిన సోనీ- అయోధ్యకు 228 కిలోమీటర్ల సాహస యాత్ర చేపట్టింది. జనవరి 17న వారణాసి నుంచి బయల్దేరిన సోనీ చౌరాసియా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న జనవరి 22న అయోధ్యకు చేరుకోనుంది. ప్రాణప్రతిష్ఠకు రావాలని సోనీకి ఇదివరకే ఆహ్వానం లభించడం విశేషం.
మహాత్మా గాంధీలా వేషం వేసుకొని కర్ణాటక నుంచి అయోధ్యకు కాలినడకన చేరుకున్నాడు కారకిట్టికి చెందిన ముత్తన తిర్లపుర. తనను తాను ఆధునిక గాంధీగా అభివర్ణించుకుంటున్న అతడు 2వేల కిలోమీటర్లు నడిచి అయోధ్యలో అడుగుపెట్టాడు. ఇదే తరహాలో ఛత్తీస్‌గఢ్ ఖార్సియాకు చెందిన 36 ఏళ్ల రైతు పాదరక్షలు ధరించకుండానే 700 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్యకు చేరుకున్నాడు. రెండు నెలల పాటు నడక సాగించి తన ప్రయాణాన్ని పూర్తి చేశాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన జస్విందర్ సింగ్, అతడి కుమారుడు సైక్లింగ్ చేస్తూ అయోధ్యకు చేరుకున్నారు. పంజాబ్‌లోని బాటాలాకు చెందిన మరో సిక్కు నితిన్ భాటియా సైతం రఘుపతి నిలయానికి సైకిల్ యాత్ర చేపట్టాడు.