'80 ఏళ్లు నిండినా రిటైర్ అయ్యేందుకు సిద్ధంగా లేరు'.. అజిత్ పవార్
X
ఎన్సీపీ వ్యవస్థాపకుడు, తన పెద్దనాన్న శరద్ పవార్‌పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవార్ వయసు గురించి ప్రస్తావిస్తూ.. కొందరు వ్యక్తులు 80 ఏండ్లు వచ్చినా కూడా తమ పదవుల నుంచి రిటైర్ కారంటూ విమర్శించారు. ‘58 ఏండ్లు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారు.చాలామంది 75 ఏండ్ల వయసు రాగానే తమ వృత్తి జీవితానికి స్వస్తి పలుకుతారు. కానీ కొంతమంది (శరద్ పవార్‌ను ఉద్దేశించి) 80 ఏండ్లు దాటి 84కు వచ్చినా రిటైరవ్వడానికి సిద్ధపడటం లేదు’ అని థాణేలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అజిత్ పవార్ విమర్శించారు.
తాము పనిచేసేందుకు ఇక్కడే ఉన్నామని.. తప్పు జరిగితే చెప్పండని.. తమకు సత్తా ఉందని స్పష్టం చేశారు. తాను రాష్ట్రానికి చాలా సార్లు డిప్యూటీ సీఎంగా ఉన్నానని.. అనేక పథకాలు విజయవంతం చేశామన్నారు. ఎన్సీపీ అధ్యక్ష పదవిపై శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య గొడవలు జరిగాయి. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో షిండే ప్రభుత్వంలో విలీనం అయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది.పార్టీ పేరు, గుర్తుపై ఎన్నికల కమిషన్ వద్ద సవాలు చేశారు. ఈ పరిణామాల మధ్య అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య రాజకీయ వివాదం నడుస్తోంది.