Parliament special sesison 2023: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ తొమ్మిది ఉండాల్సిందే : సోనియా
X
ఈ నెల 18 నంచి 22వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అయితే ఎలాంటి ఎజెండా ప్రకటించకుండా కేంద్రం ఈ సమావేశాలు ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎజెండా ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. ఎజెండా ఏంటో చెప్పాలన్న ఆమె.. ఆ ఎజెండాలో 9 అంశాలను చేర్చాలని సూచించారు.
ఇతర రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీలను ప్రకటించడంపై సోనియా ఫైర్ అయ్యారు. ఈ సమావేశాల ఎజెండా ఏంటో తమకు కనీస అవగాహన లేదని చెప్పారు. అయితే వచ్చే సమావేశాల్లో కొన్ని అంశాలను చర్చించాలని లేఖలో సోనియా కోరారు. అదానీ అక్రమాలు, మణిపుర్ అల్లర్లు, రైతు సమస్యలు, కనీస మద్దతు ధర హామీ, కులాల వారీగా జనగణన వంటి వాటిపై చర్చించాలని సోనియా సూచించారు.
అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రోజురోజుకు దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం, హరియానా సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా ఆక్రమణలపై చర్చ చేపట్టాలని ప్రధాని మోదీని సోనియా కోరారు. కాగా ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు, యూసీసీ అమలు, ఓబీసీ వర్గీకరణ వంటి అంశాలపై చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది.