తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. రాగల 3 రోజుల్లో తెలంగాణలో..
X
అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు నైరుతి రుతుపవనాలు కాస్త ఉపశమనం కలిగించనున్నాయి. ఏపీలో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్లు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఎండలనుంచి ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. మంగళవారం మధ్యాహ్నం విజయవాడలో దాదాపు రెండు గంటల పాటు భారీ వర్షం పడింది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలో 3 రోజులు వర్షాలు:
తెలంగాణలో రాగల మూడు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు 2 నుంచి 3 రోజుల్లో దక్షిణాదిలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని.. దీని ప్రభావంతో రాగల 3 రోజులు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వివరించింది. ముఖ్యంగా ఇవాళ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల సహా పలుచోట్ల వర్షాలు పడతాయని ప్రకటించింది. అంతేకాకుండా జిల్లాల్లోని పలు చోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.