Home > జాతీయం > నితీష్ ఇండియా కూటమి వైపుంటే పీఎం అవుతారు : అఖిలేష్

నితీష్ ఇండియా కూటమి వైపుంటే పీఎం అవుతారు : అఖిలేష్

నితీష్ ఇండియా కూటమి వైపుంటే పీఎం అవుతారు : అఖిలేష్
X

బిహార్ సీఎం నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీయేలో చేరుతున్నారన్న వార్తలపై సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ స్పందించారు. నితీష్ కుమార్ ఇండియా కూట‌మి వైపు నిల‌బ‌డితే ఆయ‌న ప్ర‌ధాని అయ్యేవార‌ని వ్యాఖ్యానించారు.

కూట‌మిలో ఎవ‌రి పేరునైనా ప్ర‌ధాని అభ్యర్థిత్వానికి ప‌రిశీలించే అవకాశం ఉందన్నారు. గట్టి సపోర్ట్ ఉంటే ఆయన ప్రధాని అభ్యర్థి కూడా కావొచ్చని చెప్పారు. ఇప్పటికైన నితీష్ తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని సూచించారు.

కాగా బీహార్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహా కూటమి సర్కార్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉంది. కూటమి నుంచి బయటకు వచ్చేందుకు నితీష్ కుమార్ సిద్దమయ్యారు. ఆయన తిరిగి ఎన్డీయేలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు సైతం పూర్తైనట్లు తెలుస్తోంది. భారతరత్న కర్పూరి ఠాకూర్‌ శత జయంతి కార్యక్రమంలో నితీష్ చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొందరు నేతలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని పరోక్షంగా లాలూ కుటుంబాన్ని విమర్శించారు. దీంతో రెండు పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

బీజేపీతో జతకట్టనున్న నితీష్.. ఇవాళ లేదా రేపు సీఎంగా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆదివారం బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. బీహార్ అసెంబ్లీలో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే జేడీయూ 45, ఆర్జేడీ 79, బీజేపీకి78, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలకు 16 సీట్లు ఉన్నాయి. అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ దాటాలంటే 122 మంది ఎమ్మెల్యేలు కావాలి. అయితే ఎలాగైన అధికారం దక్కించుకోవాలని ఆర్జేడీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సపోర్ట్ ఇచ్చినా.. ఇంకా 8మంది సభ్యులు ఆ పార్టీకి తక్కువగా ఉన్నారు. దీంతో అధికారం కోసం లాలూ పావులు కదుపుతున్నారు.

ఇండియా కూటమికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మమతా బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించగా.. ఇప్పుడు నితీష్ సైతం దూరమవుతున్నారు. ఇండియా కూటమి ఏర్పాటులో నితీష్ కీలకంగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిమాణాలపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. కమిటీ కన్వీనర్ లేదా ప్రధాని అభ్యర్థి స్థానాన్ని నితీష్ ఆశించారు. కానీ కాంగ్రెస్ ఆ రెండిటిని ఆయనకు దక్కకుండా చేసింది. మరికొన్ని రోజుల్లో రాహుల్ యాత్ర బిహార్లోకి ప్రవేశించనుంది. అయితే ఆ యాత్రకు దూరంగా ఉంటానని నితీష్ ప్రకటించారు.

Updated : 26 Jan 2024 4:28 PM GMT
Tags:    
Next Story
Share it
Top