Ujjain: ఉజ్జయిని ఘటన.. సాయం కోరితే అమ్మాయి చేతిలో రూ.50,100 పెట్టిన జనం
X
"మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో నడిరోడ్డుపై రక్తమోడుతూ, అర్థనగ్నంగా తిరుగుతున్న బాలిక వీడియో సంచలనం సృష్టించింది." ఓ కామాంధుడి కావరానికి బలైన ఆ అమ్మాయి ఇంటింటికీ వెళ్లి సాయం కోరినా ఒక్కరూ ఆమెను ఆదుకునేందుకు ముందుకు రాలేదు. ఈ ఘటన జరిగి 72 గంటలు జరిగినా.. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. కేసుకు సంబంధించి పోలీసుల స్టేట్మెంట్, ఎఫ్ఐఆర్లో వివరాల మధ్య పొంతనలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బాలిక పట్ల స్థానికుల వైఖరిని పోలీసు ఉన్నతాధికారి వెనుకేసుకురావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అనంతరం ఓ ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆటోలో రక్తపు మరకలు ఉన్నా అతనే నేరానికి పాల్పడ్డాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇదిలా ఉంటే బాలిక ఏం మాట్లాడే పరిస్థితిలో లేదన్న ఎఫ్ఐఆర్ లో ఆమె పూర్తి వివరాలు రాయడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బాలిక యాస ఆధారంగా ఆమె యూపీకి చెందిన అమ్మాయై ఉంటుందని చెప్పారు. అయితే ఎఫ్ఐఆర్ లో మాత్రం ఆమె మధ్యప్రదేశ్కు చెందిన అమ్మాయని ప్రస్తుతం 8వ తరగతి చదవుతోందని రాశారు. ఆమె తన తాత నాయనమ్మతో కలిసి ఉంటోందని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. ఆదివారం ఆమె తప్పిపోయినట్లు ఆమె తాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం సైతం వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉంటే రక్తమోడుతున్న బాలిక సాయం కోరినా ఎవరూ పట్టించుకోలేదన్న ఆరోపణలను ఉజ్జయినీ ఎస్పీ సచిన్ శర్మ కొట్టి పారేశారు. ఏడెనిమిది మంది స్థానికులు ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారని చెప్పారు. టోల్ బూత్ సిబ్బంది ఆమెకు కొంత డబ్బు బట్టలు ఇచ్చారని చెప్పారు. స్థానికులు దాదాపు 120 రూపాయలు ఆ అమ్మాయికి ఇచ్చి ఆదుకున్నారని అన్నారు. సదరు బాలికకు వైద్య సాయం అందించేందుకు ఎవరూ ముందుకురాలేదన్న ప్రశ్నకు ఎస్పీ వింత జవాబు చెప్పారు. జనానికి ఎవరి పనులు వారికి ఉంటాయని, అయినా అమ్మాయి వారికి ఎవరో తన వెంటపడుతున్నారని, తాను ప్రమాదంలో ఉన్నానని చెప్పిందే తప్ప ఏం సాయం కావాలన్న విషయం స్పష్టంగా చెప్పలేదని అన్నారు. పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటని అంటున్నారు.