హేమంత్ సోరెన్కు రిలీఫ్.. బల నిరూపణకు హాజరయ్యేందుకు కోర్టు పర్మిషన్..
X
జార్ఖండ్లో చంపై సోరెన్ నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఈ నెల 5న బలపరీక్షకు సిద్ధమైంది. గవర్నర్ ఆదేశాల మేరకు చంపై సోరెన్ సోమవారం సభలో బలం నిరూపించుకోనున్నారు. ఇందుకోసం సోమవారం నుంచి రెండ్రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ క్రమంలో మాజీ సీఎం హేమంత్ సోరెన్ రాంచీ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. బలపరీక్షకు హజరయ్యేందుకు అనుమతించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.
హేమంత్ సోరెన్ పిటిషన్పై విచారణ జరిపిన PMLA కోర్టు ఆయనకు అనూకూలంగా తీర్పు ఇచ్చింది. సోమవారం జరిగే బల నిరూపణకు హాజరయ్యేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.600 కోట్లకు సంబంధించిన భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్‌ను బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఆయనకు 5 రోజుల ఈడీ కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం ఆయన రాంచీ జైలులో ఉన్నారు.
ఇదిలా ఉంటే జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తొలిరోజే బల నిరూపణకు జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమి సిద్ధమైంది. సభలో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. జేఎంఎం నేతృత్వంలోని కూటమికి 48 మంది సభ్యుల బలముంది. ఈ నేపథ్యంలో సభలో సులభంగా బలం నిరూపించుకుంటామని కొత్త సీఎం చంపై సోరెన్ ధీమాతో ఉన్నారు. అయితే తమ కూటమి ఎమ్మెల్యేలకు ఇతర పార్టీలు గాలం వేయకుండా 40 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్లోని రిసార్టుకు తరలించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వారిని కో ఆర్డినేట్ చేస్తున్నారు.