Home > జాతీయం > అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా.. ఇలా వెళ్లండి

అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా.. ఇలా వెళ్లండి

అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా.. ఇలా వెళ్లండి
X

అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్లాలనుకునే తెలంగాణ, ఏపీ భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ అనంతరం జనవరి 23 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు బాల రాముడిని దర్శించుకునేందుకు వెళ్లాలనుకుంటున్నారు. వారి కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో రైళ్లు నడపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్లాన్ చేసింది.

జనవరి 29 తర్వాత తెలంగాణలోని సికింద్రాబాద్‌, కాజీపేట రైల్వేస్టేషన్ల నుంచి అయోధ్య స్టేషన్‌కు స్పెషల్ ట్రైన్ లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఏపీలోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది. సికింద్రాబాద్‌ - అయోధ్య ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. విజయవాడ - అయోధ్య రైళ్లు.. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్ల మీదుగా అయోధ్యకు వెళ్లనున్నాయి.

సికింద్రాబాద్‌ - అయోధ్య స్పెషల్ ట్రైన్లు జనవరి 29, 31 తేదీలతో పాటు ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరుతాయి. మరుసటి రోజు అయోధ్య నుంచి సికింద్రాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతాయి. ఇక కాజీపేట నుంచి అయోధ్యకు జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో సాయంత్రం 6.20 గంటలకు రైళ్లు బయల్దేరుతాయి. మరుసటి రోజు అయోధ్య నుంచి తిరిగి కాజీపేట వస్తాయి.

విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న, గుంటూరు నుంచి జనవరి నుంచి 31న, రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి 7న సామర్లకోట నుంచి ఫిబ్రవరి 11న స్పెషల్ ట్రైన్లు అయోధ్యకు బయలుదేరుతాయి. గమ్యస్థానాన్ని చేరుకున్న అనంతరం అయోధ్య నుంచి తిరిగి ఆయా స్టేషన్లకు తిరిగి రానున్నాయి.

Updated : 18 Jan 2024 12:01 PM IST
Tags:    
Next Story
Share it
Top