Parliament Building : కొత్త బిల్డింగులో కొలువుదీరనున్న సభ.. ప్రత్యేకతలు ఏంటంటే..
X
దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కొత్త పార్లమెంట్ భవనం నిర్మించారు. 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలకు ప్రతీకగా నిలవనున్న కొత్త ప్రజాస్వామ్య మందిరంలో ఇవాళ్టి నుంచి సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు పాత బిల్డింగులో ఫొటో సెషన్ అనంతరం సభ్యులంతా కొత్త భవనంలో వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ రాజ్యాంగ ప్రతిని తీసుకుని కొత్త బిల్డింగులోకి అడుగుపెట్టనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్‌సభ, మధ్యాహ్నం 2.15 గంటలకు రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
1272 మంది కూర్చునేలా
కొత్త పార్లమెంటు బిల్డింగ్ దాదాపు 65,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులు ఉన్నాయి. కొత్త పార్లమెంట్ ఎత్తు కూడా పాత భవనం అంతే ఉంటుంది. ఒకేసారి 1272 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని డిజైన్ చేశారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సభాపతులు, మంత్రులకు ప్రత్యేక ఆఫీసులు ఉన్నాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీ హాల్స్, క్యాంటీన్లు ఉన్నాయి.
ఎన్నో ప్రత్యేకతలు
కొత్త పార్లమెంట్‌లోని చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎంపీల ప్రసంగాల కోసం కేటాయించిన మైక్రోఫోన్‌లకు ఒక ప్రత్యేకత ఉంది. ఎంపీలకు కేటాయించిన సమయం ముగిసిన వెంటనే.. వారి మైక్రోఫోన్స్ ఆఫ్ అయ్యేలా ఆటోమేటెడ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లుతెలుస్తోంది. కేవలం ఇదొక్కటే కాదు.. సాధారణంగా విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నిరసనలు తెలుపుతుంటారు. అయితే.. కొత్త బిల్డింగులో అందుకు వీలు లేకుండా ఆ స్థలాన్ని చాలా వరకు కుదించారు. బయోమెట్రిక్ వ్యవస్థని సైతం ఏర్పాటు చేశారు. ఈ కొత్త భవనంలో ఇకపై పేపర్‌లెస్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ప్రతీ ఎంపీకి ఒక ప్రత్యేకమైన టాబ్లెట్ కంప్యూటర్‌ని ఇస్తారు. ప్రతి సభ్యుడి సీటు దగ్గర మల్టీమీడియా డిస్‌ప్లే సదుపాయం ఉంది. సాధారణ ప్రజలు గ్యాలరీల్లో ఎక్కడ కూర్చునయినా స్పష్టంగా సమావేశాలు చూడగలరు. మీడియా కోసం ప్రత్యేకంగా 530 సీట్లు కేటాయించారు. కొత్త పార్లమెంటు బిల్డింగుకు ఉన్న ఆరు ద్వారాలు మరో ప్రత్యేక ఆకర్షణ. వీటికి గజ, అశ్వ, గరుడ, మకర, శార్దూల, హంస అని పేర్లు పెట్టారు.
రూ.1200 కోట్ల వ్యయం
అద్భుతమైన కళాకృతులు, నిర్మాణ కౌశలంతో కొత్త పార్లమెంట్ బిల్డింగ్ రూపుదిద్దుకుంది. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించిన ఈ భవనాన్ని 150 ఏండ్లకు పైగా మన్నేలా కట్టారు. జోన్-5 భూకంపాలను సైతం ఈ భవనం తట్టుకోగలదు. 60 వేలమంది కార్మికులు 20లక్షల 90వేలకుపైగా గంటలు శ్రమించి కొత్త బిల్డింగ్కు రూపమిచ్చారు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి 2ఏండ్ల 5 నెలల 18 రోజుల సమయం పట్టింది. 862 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు.. పూర్తయ్యేసరికి ఆ ఖర్చు 1200 కోట్లకు చేరింది.
అవసరాలను తగ్గట్లు
పార్లమెంటు బిల్డింగ్ ను 1927లో నిర్మించారు. దాదాపు వందేళ్ల క్రితం నాటి ఈ బిల్డింగ్ ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా లేకపోవడం, లోక్ సభ, రాజ్యసభలో ఎంపీలు కూర్చునేందుకు సరైన సౌకర్యం లేదు. దీంతో ప్రధాని నరేంద్రమోడీ 2020 డిసెంబర్ లో కొత్త పార్లమెంటు బిల్డింగ్ నిర్మిణానికి భూమి పూజ చేశారు. కొత్త బిల్డింగులోని రాజ్యసభ ఛాంబర్ లో 384 మంది, పార్లమెంటు జాయింట్ సెషన్ నిర్వహించేందుకు అనువుగా 888 మంది ఎంపీలు కూర్చునేలా లోక్ సభ ఛాంబర్ తీర్చిదిద్దారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్‌పథ్ మధ్య ఉన్న 3 కిలోమీటర్ల స్థలంలో కేంద్ర ప్రభుత్వ భవనాలు నిర్మించారు. సెంట్రల్ సెక్రటేరియట్, కొత్త ఆఫీసులు, ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి నిలయం కూడా సిద్ధమయ్యాయి.