CM Siddaramaiah : అప్పులు చేసి మరీ పెళ్లిళ్లు చేసుకోకండి... సీఎం
X
సమాజంలో గొప్ప(పేరు) కోసం.. స్థాయికి మించి, అప్పులు చేసి ఆడంబరంగా వివాహ వేడుకలు చేసుకోవడం ఆపాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని పేద, (దిగువ)మధ్యతరగతి వర్గాలనుద్దేశించి సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజంలో సాధారణ, సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని అన్నారు.
మైసూరు సమీపంలోని చామరాజనగర్‌లోని శ్రీ మలై మహదేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక వివాహ వేడుకలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి వర్గాల వారు గొప్పలకు పోయి అప్పుల ఊబిలో పడకూడదన్నారు. స్థాయికి మించి ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవడం భవిష్యత్తులో పెను భారంగా మారుతోందని అన్నారు. తమంది వ్యవసాయ భూములను తాకట్టు పెట్టి మరీ రుణాలు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ అప్పుతో సమాజంలో పేరు కోసం ఘనంగా పెళ్లుళ్లు చేస్తున్నారని, ఒక్కసారి పెళ్లి చేసి.. ఆ పెళ్లికి అయిన అప్పులు తీర్చేందుకు జీవితాంతం కష్టపడాల్సి వస్తోందని అభిప్రాయ పడ్డారు. అందుకే సాదాసీదాగా జరిగే సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని కన్నడవాసులకు సీఎం పిలుపునిచ్చారు. సామూహిక వివాహాలతో భారీ ఖర్చులు తగ్గుతాయని వివరించారు.
ఈ సందర్భంగా మహదేశ్వర ఆలయం గురించి మాట్లాడుతూ.. ఈ ఆలయం ప్రస్తుతం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పవిత్ర ప్రదేశమని అన్నారు. తాను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక మలై మహదేశ్వర్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. గతంలో తీసుకున్న చర్యల వల్ల ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. కర్ణాటక సర్కార్ అమలు చేస్తున్న శక్తి యోజన ఫలితంగా భక్తులు ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మలై మాదేశ్వరుని దర్శనం చేసుకుంటున్నారని ఆయన అభినందించారు.