తినడం మానేస్తేనే ధరలు దిగివస్తాయ్..టమాటా రేట్లపై మంత్రి ఉచిత సలహా
X
టామాటా ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. పక్షం రోజులకు పైగా రేట్లు సామాన్యులకు చుక్కలను చూపిస్తున్నాయి. కిలో ధర సెంచరీ దాటడంతో టమాటాలు కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో పెరిగిన టమోటా ధరలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా మంత్రి ప్రతిభా శుక్లా వివాదాస్పద కామెంట్స్ చేశారు. ప్రజలు టమాటాలను తినడం ఆపేస్తేనే ధరలు దిగి వస్తాయని మంత్రి వ్యాఖ్యానించారు. అసలు టమాటా రేట్లు అంతుచిక్కనివిగా మారాయని అన్నారు. అత్యంత ఖరీదైన కూరగాయగా మారిన టమాటాలను ఎవరూ కొనుగోలు చేయకపోతే ధరలు తగ్గుముఖం పడతాయని ఉచిత సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు.
ఉల్లిగడ్డలు తినకండి. మా ఇంట్లో మేము వాటిని వాడటం లేదు. వాటిని తినడం మానేస్తేనే రేట్లు తగ్గుతాయి అని 2019లో ఉల్లిగడ్డల రేట్ల పెరుగుదలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు భగ్గుమన్న విషయం తెలిసిందే. అప్పట్లో కేంద్రం మంత్రి ఈ వ్యాఖ్యలు సెన్సేషనల్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు అదే తరహాలు యూపీ మంత్రి, బీజేపీ మహిళా నాయకురాలు ప్రతిభా శుక్లా పెరిగిన టామాటా ధరలపై ఉచిత సలహాలు ఇచ్చి సామాన్యుల ఆగ్రహానికి గురయ్యారు. "పెరిగిన ధరలు తగ్గుముఖం పట్టాలంటే ప్రజలు టమాటాలు తినడం మానేయాలన్నారు మంత్రి. వాటిని కావాల్సి వస్తే ఇంట్లోనే పండించుకోవాలని, లేదా టమాటాలకు బదులుగా నిమ్మకాయలను వినియోగించుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చారు. అందరూ టమాటాలను తినడం మానేస్తే ధరలు దిగివస్తాయని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.
ఓ బాధ్యత గల మంత్రి హోదాలో ఉన్న ప్రతిభా శుక్లా ఇలా వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్ష నేతలు, సామాన్యులు మండిపడుతున్నారు. ఒకవేళ బియ్యం ధరలు పెరిగితే ‘అన్నం తినడం మానేయాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఉచిత సలహాలు తమకు వద్దంటూ ఫైర్ అయ్యారు. ధరలను కంట్రోల్ చేయడంలో విఫలమైన బీజేపీ సర్కార్ ఇలాంటి చౌకబారు సలహాలు ఇస్తుందని విమర్శిస్తున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.