టీచర్పై విద్యార్థుల ఘాతుకం.. ఎలా ఉన్నారని పలకరిస్తూనే...!
X
విద్యాబుద్ధులు నేర్పిన టీచర్ పైనే విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. బయట కలిసిన తమ టీచర్ యోగ క్షేమాలు అడుగుతూనే.. తుపాకితో దాడి చేశారు. తరచూ ట్యూషన్ ఫీజు గురించి అడుగుతున్నాడని.. దాడి చేసిన ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో జరిగింది. గిర్వార్ సింగ్ అనే టీచర్ జౌరా రోడ్ లో ట్యూషన్ సెంటర్ నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు 12వ తరగతి వరకు గిర్వార్ దగ్గర ట్యూషన్ చెప్పించుకున్నారు.
ట్యూషన్ పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడంతో గిర్వార్.. వాళ్లు కనిపించినప్పుడల్లా ఫీజు గురించి అడిగేవాడు. తనకు అవసరాలు ఉన్నాయని.. తొందరగా ఫీజు చెల్లించాలని కోరాడు. దీంతో ఆగ్రహం చెందిన ఆ స్టూడెంట్స్.. టీచర్ పై దాడి చేయాలని ప్లాన్ చేశారు. బుధవారం (జూన్ 21) సాయంత్రం ట్యూషన్ సెంటర్ కు వచ్చిన స్టూడెంట్స్.. గిర్వార్ ను బయటికి పిలిచారు. ఎలా ఉన్నారు సార్? అని పలకిరిస్తూనే జేబులోంచి తుపాకి తీసి కాల్పులు జరిపారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు గిర్వార్ ను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గ్వాలియర్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గిర్వార్ దగ్గర ఆరా తీశారు. తర్వాత సీసీ కెమెరాల ద్వారా జరిగిన విషయం తెలుసుకుని.. నిందితుల కోసం గాలిస్తున్నారు.