Subrata Roy : 'పెరోల్‌పై ఉండగానే.. 'సహారా గ్రూప్ చైర్మన్ కన్నుమూత
X
సహారా గ్రూప్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ సుబ్రతా రాయ్(75) దీర్ఘకాలంగా అనారోగ్యంతో పోరాడుతూ ముంబయిలోని ఒక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు మరణించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మంగళవారం రాత్రి గుండెపోటుతో ఆయన మరణించినట్లు కంపెనీ వెల్లడించింది. సుబ్రతా రాయ్ చాలా కాలంగా మెటా స్టాటిక్ కేన్సర్, హై బీపీ, మధుమేహంతో బాధపడుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడం వల్ల ముంబయిలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారని.. అక్కడే చికిత్స పొందుతూ మరణించారని కంపెనీ తెలిపింది. సుబ్రతారాయ్ మృతితో సహారా ఇండియా పరివార్ శోకసముద్రంలో మునిగిపోయిందని పేర్కొంది.
1948లో బీహార్‌లోని అరారియాలో జన్మించిన రాయ్ గోరఖ్‌పూర్‌లోని గవర్నమెంట్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆర్థిక ఒత్తిళ్లలో ఉన్న చిట్‌ఫండ్ కంపెనీ సహారా ఫైనాన్స్‌ను 1976లో కొనుగోలు చేసిన రాయ్ 1978 కల్లా దానిని సహారా ఇండియా పరివార్‌గా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఆర్థిక, మీడియా, స్థిరాస్తి, ఆతిథ్య రంగాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. కేవలం రూ.2,000 మూలధనంతో ప్రారంభించి, వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచేందుకు కంపెనీ చాలా దూరం ప్రయాణించిందని సహారా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
"It is with profound sadness that Sahara India Pariwar informs the demise of our Hon'ble 'Saharasri' Subrata Roy Sahara, Managing Worker and Chairman, Sahara India Pariwar," reads the press statement by Sahara India Pariwar. pic.twitter.com/gklwFOlT67
— Press Trust of India (@PTI_News) November 14, 2023
కానీ ఇప్పుడు.. "సహారా చిట్ ఫండ్ స్కామ్"గా పిలవబడే కేసులో నిధుల విషయంలో సహారా.. 2014 నుంచి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన రూ.62,600 కోట్ల నగదును రిఫండ్ చేయాల్సిందిగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కోరినప్పటికీ అందులో విఫలం కావడం వల్ల సుప్రీం కోర్టు ఆదేశాల మధ్య రాయ్ తిహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం పెరోల్‌పై ఉంటున్న రాయ్ మంగళవారం కన్నుమూశారు. సుబ్రతా రాయ్ కు భార్య స్వప్న రాయ్, ఇద్దరు కుమారులు సుశాంతో రాయ్, సీమంతో రాయ్ లు ఉండగా, వారు విదేశాల్లో నివసిస్తున్నారు. 2012 లో సుబ్రతా రాయ్ భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన 10 మంది వ్యాపారవేత్తలలో ఒకరిగా పేరు పొందారు.