Bindeshwar Pathak : సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత
X
సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్, స్వచ్ఛ రైల్ మిషన్ బ్రాండ్ అంబాసిడర్ బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏండ్లు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సులభ్ ఇంటర్నేషనల్ సెంట్రల్‌లో ఉదయం జెండా ఎగురవేసిన అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో బిందేశ్వర్ ను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
1970లో బిందేశ్వర్ సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. సులభ్ శానిటేషన్ అండ్ సోషల్ రిఫార్మ్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడైన ఆయన.. బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి కృషి చేశారు. రైల్వే ప్రాంగణాల్లో పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో.. 2016లో బిందేశ్వర్ స్వచ్ఛ రైలు మిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
బిందేశ్వర్ పాఠక్ బీహార్ వైశాలీ జిల్లాలోని రాంపూర్ బఘేల్ గ్రామంలో 1943 ఏప్రిల్ 2న జన్మించారు. 1964లో సోషియాలజీలో డిగ్రీ కంప్లీట్ చేశారు. 1980లో పాట్నా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని, 1985లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. రచయిత, వక్త అయిన డాక్టర్ పాఠక్ రోడ్ టు ఫ్రీడమ్ సహా అనేక పుస్తకాలను రాశారు. ప్రపంచవ్యాప్తంగా పారిశుద్ధ్యం, ఆరోగ్యం, సామాజిక పురోగతిపై జరిగే సమావేశాల్లో తరచుగా పాల్గొనేవారు. 1991లో బిందేశ్వర్ కు మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ లభించింది.