స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు !
X
తెలుగురాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. జూన్ నెల వచ్చిన పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపించడం లేదు. మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఇచ్చిన వేసవి సెలవులను పొడిగించింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ అధికమవుతుండటంతో స్టాలిన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
తమిళనాడులో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి 6-10 తరగతులకు, జూన్ 5వ తేదీ నుంచి 1-5 తరగతులకు స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే ఎండలు తగ్గుముఖం పట్టకపోవడంతో జూన్ 6వ తేదీన తరగతులు నిర్వహించాలని భావించారు. ఇప్పటికీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఈ నెల 11వ తేదీ వరకు వేసవి సెలవులను పొడగించారు. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ 6-10 తరగతులకు, ఇంటర్ విద్యార్ధులకు జూన్ 12, 1-5 తరగతులకు జూన్ 14 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు తమిళనాడు విద్యాశాఖ ప్రకటించింది.
ఏపీ, తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే.. ఎండ తీవ్రత ఇలానే కొనసాగితే తెలుగురాష్ట్రాల్లో కూడా వేసవి పొడిగిస్తారన్న ప్రచారం సాగుతోంది.