6వేల ఎఫ్ఐఆర్లు నమోదైతే ఏడుగురినే అరెస్ట్ చేస్తారా..?
X
మణిపూర్ లో జరిగిన అమానుష ఘటనలపై సుప్రీంకోర్టులో రెండోరోజు వాదనలు కొనసాగాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఆ రాష్ట్ర పోలీసుల తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మణిపూర్ పోలీసులు నియంత్రణ కోల్పోయారని, వారికి దర్యాప్తు చేసే సామర్థ్యం లేదని అభిప్రాయపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అసలే లేకుండా పోయాయని, పౌరలకు రక్షణ కల్పించలేనప్పుడు పోలీసు యంత్రాంగం ఉండి ఏం ప్రయోజనం అని ప్రశ్నించింది. అల్లరి మూకలకు మహిళల్ని అప్పగించిన పోలీసులను రాష్ట్ర పోలీసులు ప్రశ్నించారా అని అడిగింది. గత రెండు నెలలుగా మణిపూర్లో శాంతి భద్రతలు, రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని, దర్యాప్తు కూడా నత్తనడకన సాగుతోందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది.
మణిపూర్ లో మహిళలను వివస్త్రలను చేసిన తిప్పిన ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరగడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 6వేల ఎఫ్ఐఆర్లు నమోదైతే మైనర్ సహా కేవలం ఏడుగురిని మాత్రమే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించింది. రాష్ట్రంలో జరిగిన ఘటనలు, తీసుకున్న చర్యలకు సంబంధించి పూర్తి వివరాలతో రాష్ట్ర డీజీపీ వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. విచారణకు ఆగస్టు 7కు వాయిదా వేసింది.