Home > జాతీయం > మణిపూర్‌ అమానుష ఘటనపై సుప్రీం సీరియస్‌..

మణిపూర్‌ అమానుష ఘటనపై సుప్రీం సీరియస్‌..

మణిపూర్‌ అమానుష ఘటనపై సుప్రీం సీరియస్‌..
X

మణిపూర్లో మహిళలపై జరిగిన అమానుష ఘటనపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడి ఘటనను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం.. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రభుత్వాలను న్యాయస్థానం నిలదీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే తామే చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేసింది.

ఈ ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. మహిళలపై హింస దృశ్యాలను సోషల్ మీడియాలో ప్రసారం చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వీడియోతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారని తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా మణిపూర్లో ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

మహిళలను నగ్నంగా ఊరేగించడంతోపాటు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మే 4న రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికే ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు చేపట్టారు. ప్రధాని మోడీ నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Updated : 20 July 2023 1:53 PM IST
Tags:    
Next Story
Share it
Top