Supreme Court : స్వలింగ వివాహాల చట్టబద్ధతపై ఇవాళ సుప్రీం తీర్పు
X
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధపై ఇవాళ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మే 11న తన తీర్పును రిజర్వు చేసింది. అంతకుముందు 10రోజుల పాటు సుప్రీంలో వాదోపవాదాలు జరిగాయి. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం సరైన నిర్ణయం కాదని కేంద్రం అభిప్రాయపడింది.
ఒకవేళ చట్టబద్ధత కల్పిస్తే ఆ తర్వాత వచ్చే పరిణామాలను అంచనా వేయడం, ఎదుర్కోవడం సాధ్యం కాదని కేంద్రం వాదించింది. ఏపీ, రాజస్థాన్, అస్పాం సహా పలు రాష్ట్రాలు స్వలింగ వివాహాల చట్టబద్ధతను వ్యతిరేకించాయని కోర్టుకు తెలిపింది. అంతేకాకుండా పిటిషన్లను కేంద్ర ప్రభుత్వంతోపాటు జాతీయ బాలల హక్కుల సంఘం, జమియత్-ఉలమా-ఇ-హింద్ ఇస్లామిక్ సంఘం వ్యతిరేకించాయి.
కేంద్ర ప్రభుత్వ వాదనలు విన్న న్యాయమూర్తులు ఈ అంశం పార్లమెంటు పరిధిలోకి వస్తుందని అంగీకరించారు. స్వలింగ జంటలు ఎదుర్కొంటున్న మానవ సమస్యలను పరిష్కరించగలరా ? అని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించకుండా.. అలాంటి జంటలకు కొన్ని హక్కులు కల్పించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని సొలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.