Rohini Sindhuri : గొడవ పడింది చాలు.. వివాదానికి ముగింపు పలకండి
X
ఐపీఎస్ అధికారి డీ రూపపై ఐఏఎస్ రోహిణి సింధూరి వేసిన పరువునష్టం కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు అభయ్ ఎస్. ఓకా, ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఇద్దరి అధికారులకు పలు కీలక సూచనలు చేసింది. ఇద్దరి మధ్య వివాదాన్ని నెలలోగా, ప్రశాంతంగా పరిష్కరించుకోవాలని కోరింది. 'ఇద్దరూ కూడా ఉన్నత పదవుల్లో ఉన్నవారే. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఆలోచించి సమస్యను పరిష్కరించుకోండి. మొండి పట్టుదల వల్ల సాధించేది ఏం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నెలలోగా వివాదానికి ముగింపు పలకండి' అంటూ బెంచ్ పేర్కొంది.
ఉన్నత పదవుల్లో ఉన్న మీరే ఇలా గొడవ పడి.. సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారో ఓ సారి ఆలోచించాలంటూ రోహిణి, రూపలను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇలా ఆరోపణలు చేసుకోవడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. అయితే సామాజిక మాధ్యమంలో తన వ్యక్తిగత పోస్టులను పెట్టి, అధారాలు లేని ఆరోపణలు చేసినందుకు గాను.. రూప క్షమాపణ చెప్పడంతో పాటు రూ. కోటి ఇవ్వాలని రోహిణి సింధూరి తరపు లాయర్ డిమాండు చేశారు. కించపరుస్తూ పెట్టిన పోస్టులు తొలగిస్తే సరిపోదని. ..తన క్లయింట్కు పరువు నష్టం కలిగించిన రూపా డి మౌద్గల్ క్షమాపణలు చెప్పాల్సిందే అని రోహిణి లాయర్ పట్టుబట్టడంతో విచారణను సర్వోన్నత న్యాయస్థానం మార్చి 15కు వాయిదా వేసింది.