Home > జాతీయం > Article 370:ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీం తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

Article 370:ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీం తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

Article 370:ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీం తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
X

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాల్లో 370 ఆర్టికల్ రద్దు ఒకటి. ఈ అంశం దేశ వ్యాప్తంగా ఎంతటి దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇష్యూపై పార్లమెంట్‌లో అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. తాజాగా.. ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ.. 2019లో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేయటం రాజ్యాంగబద్ధమేనా అన్నదానిపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌లు సంజయ్‌ కిషన్‌ కౌల్‌, సంజీవ్‌ ఖన్నా, బీఆర్‌ గవాయ్‌, సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆగస్టు 2వ తేదీన విచారణను ప్రారంభించింది. 16 రోజులపాటు విచారణ జరిపిన ధర్మాసనం సెప్టెంబర్‌ 5వ తేదీన తన తీర్పును రిజర్వులో పెడుతున్నట్లు ప్రకటించింది. నేడు ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించబోతున్నట్లు అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జమ్ముకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.కొందరిని అదుపులో తీసుకోగా, మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. 2 వారాల ముందు నుంచే కశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మొహరించారు. ఇప్పటికే రాష్ట్రం లోని 10 జిల్లాలు పూర్తిగా పోలీసుల నియం త్రణలో ఉన్నాయి.

ఈ క్రమంలోనే తీర్పును రాజకీయం చేయవద్దని, ప్రతి ఒక్కరూ గౌరవించాలని బీజేపీ పలు రాజకీయ పార్టీలకు విన్నవించింది. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమైందని సుప్రీం తీర్పు స్పష్టం చేస్తుందని పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ఎన్‌సీ, పీడీపీలు పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ)లో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి.

Updated : 11 Dec 2023 10:37 AM IST
Tags:    
Next Story
Share it
Top