500 ఏండ్ల నాటి శపథం.. జనవరి 22న అయోధ్యలో మరో కీలక ఘట్టం
X
అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్ధమవుతోంది. 2024 జనవరి 22న రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అదే రోజున మరో ముఖ్యమైన సంఘటన జరగబోతోంది. అయోధ్య చుట్టుపక్కల ఉన్న 105 గ్రామాలకు చెందిన సూర్యవంశ క్షత్రియుల శపథం నెరవేరనుంది. రామ జన్మభూమి అయోధ్య చుట్టుపక్కలున్న లక్షన్నర మంది సూర్య వంశ క్షత్రియులు 500ఏండ్ల తర్వాత తలపాగా, చెప్పులు ధరించనున్నారు.
16వ శతాబ్దంలో మొఘలుల దండయాత్రలో రామ మందిరాన్ని కూల్చివేశారు. ఆ సమయంలో వారిని అడ్డుకునేందుకు సూర్యవంశ క్షత్రియులు ప్రాణాలుపణంగా పెట్టి పోరాడారు. సాహసోపేతంగా పోరాడినప్పటికీ వారు ఆలయ కూల్చివేతను అడ్డుకోలేకపోయారు. దీంతో మనస్థాపానికి గురైన వారంతా అదే మందిరాన్ని కూల్చిన చోట కొత్త గుడి కట్టే వరకు తలపాగా ధరించమని, గొడుగులు వాడమని, కాళ్లకు చెప్పులు వేసుకోమని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచి గత 500 ఏండ్లుగా వారు తమ ఇంట్లో పెళ్లి సహా ఎలాంటి వేడుకలు, శుభకార్యాలు జరిగినా తలపాగా ధరించలేదు.
22 జనవరి 2024న రామమందిరం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో 5 శతాబ్దాల శపథం నెరవేరనుంది. ఆ రోజు నుంచి సూర్యవంశ క్షత్రియులు తలపాగా, కాళ్లకు చెప్పులు వేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అయోధ్య చుట్టుపక్కలున్న 105 గ్రామాల్లోని సూర్యవంశ క్షత్రియులకు రామ మందిర ప్రారంభోత్సవం రోజున ధరించేందుకు తలపాగాలు పంపిణీ చేస్తున్నారు.