Combined Elections.. జమిలి ఎన్నికలపై నెల కిందట అలా, ఇప్పుడిలా? నిజంగానే ఉంటాయా?
X
ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికే సమావేశాలు పెట్టారని జాతీయ, ప్రాంతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికల జరిపేందుకు ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లును ప్రవేశపెడతారని చెబుతున్నారు. విపక్ష ‘ఇండియా కూటమి’ బలం పుంజుకోవడంతో మోదీ భయపడి ముందుస్తు ఎన్నికలకు వెళ్తున్నారని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అంటున్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఎంపీలు హెలికాప్టర్లను బుక్ చేసుకోవడంతో అవి అందుబాటులో లేకుండాపోయాయని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడుతున్నారు.
అప్పుడలా...
జమిలి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని కేంద్రం జూలై 28న పార్లమెంటులోనో తేల్చి చెప్పింది. ఉమ్మడి ఎన్నికలు జరపాలంటే ఐదు అడ్డంకులు ఉన్నాయని న్యాయమంత్రి అర్జున్ రామ్ వివరించారు. రాజ్యాంగంలో 5 అధికరణలను సవరించి, రాజకీయ ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుందని అన్నారు. దీంతో జమిలి ఎన్నికల జరగవని భావించారు. దేశానికి జమిలి ఎన్నికలు, ఒకే ఓటర్ల జాబితా ఉండాలని పదే పదే చెబుతున్న ప్రధాని తాజా పంద్రాస్టు ప్రసంగంలో ఆ అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం.
ఏకాభిప్రాయం కోసమా? ముందస్తుకా?
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించినట్లు కనిపిస్తోంది. మరోపక్క ఎన్డీఏ కూటమి గురించి ఇన్నాళ్లూ పట్టించుకోని బీజేపీ ఇటీవల సమావేశం అయింది. 27కుపైగా విపక్షాలు ‘ఇండియా’ కూటమి పేరుతో జట్టుకట్టడంతో కాషాయ దళం అప్రమత్తమైంది. ఇప్పటికిప్పుడు పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే మోదీ తిరిగి అధికారంలోకి వస్తారని పలు సర్వేలు చెబుతున్నాయి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా ముందుకు వెళ్తేనే మంచిందని మోదీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేక కారణాలేవీ చెప్పకుండానే ‘చర్చల కోసం’ ప్రత్యేకంగా చట్టసభను సమావేశపర్చడం తలపండిన రాజకీయ విశ్లేషకులకు కూడా అర్థం కావడం. మోదీ పెద్ద నోట్ల రద్దు వంటి అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం కొత్త కాదు కనుక జమిలి ఎన్నికలపై బిల్లు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మరోపక్క.. జమిలి ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేసిన లాకమిషన్ అందుకు సానుకూల సంకేతాలు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.
కష్టమైనా గట్టెక్కిసారా?
జమిలి ఎన్నికలను నిర్వహించడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. పార్టీల ఏకాభిప్రాయం, అసెంబ్లీల రద్దు, పొడిగింపు వంటి అనేక అంశాలలో ఇది ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా ఐదు రాజ్యాంగ అధికరణలను సవరించాల్సి ఉంటుంది. పార్లమెంటు కాలపరిమితి(83వ అధికరణం), లోక్‌సభను రద్దు చేసే రాష్ట్రపతికి అధికారం (85 అధికరణం 85), అసెంబ్లీల కాలపరిమితి (172వ అధికరణ), అసెంబ్లీల రద్దు (174వ అధికరణ), రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన(356వ అధికరణ)లను మార్చాల్సి ఉంటుంది. దీనికి బీజేపీయేతర రాష్ట్రాల్లోని పార్టీలు ఒప్పుకోకపోవచ్చు. జమిలి ఎన్నికలు జరపాలంటే ఎన్నికల కమిషన్ పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. పార్లమెంటు, అసెంబ్లీల ఎన్నికలకు భారీ సంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్లను, పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాను సమకూర్చుకోవాలి.
2024 మధ్యలో జరగాల్సిన పార్లమెంటు ఎన్నికలతోపాటు అన్ని రాష్ట్రాల ఎన్నికలను ఇప్పుడే నిర్వహించేందుకు అవసరమైన ఏకాభిప్రాయం, రాజ్యాంగ సవరణలు, ఏర్పాట్లు ఈ మూడు నాలుగు నెలల్లో ఎంతవరకు పూర్తవుతాయనే సందేహాలకు ప్రస్తుతానికి సమాధానాలు లేవు. మోదీ ఏం నిర్ణయిస్తారో తెలుసుకోవాలంటే ఈనెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను గమనించాల్సిందే.