ఆ 40 స్థానాలు మావే..సీఎం సంచలన వ్యాఖ్యలు
X
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తమిళనాడులో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో తమ పార్టీ శ్రేణులను, కార్యకర్తలను బలపరిచేందుకు నేతలు దృష్టిసారిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా వచ్చే లోక్‌సభ ఎలెక్షన్స్లో పుదుచ్చేరి సహా 40 స్థానాలు మన పార్టీవేననే నినాదంతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని సూచించారు. అందుకు అనుగుణంగా సామాజిక మాధ్యమాల సహకారాన్ని తీసుకోవాలన్నారు.
సేలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.." కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడుకు అందించిన పథకాలలో డీఎంకే భాగస్వామ్యం ఉంది. అయితే ఈ తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి అందించిన పథకాల లిస్టును ఆదివారం వేలూరులో జరుగనున్న బీజేపీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్‌షా చెప్పగలరా?. దేశంలో బీజేపీ హవా తగ్గుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలే అందుకు నిదర్శనం. సేలం డీఎంకేకి కంచుకోట వంటిది. దివంగత మాజీ సీఎం అన్నాదురై న్యూజస్టిస్ పార్టీని ద్రావిడ కళగంగా మార్చింది సేలం గడ్డపైనే. అందుకే 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే జరగాలి. ఎలక్షన్లకు ఇంకా ఏడాది సమయం ఉందనే భ్రమతో ఉండకండి. ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సైనికుల్లా పని చేయాలి. లోక్‌సభ ఎలెక్షన్స్లో పుదుచ్చేరి సహా 40 స్థానాలు మన పార్టీవేననే నినాదంతో ముందుకు కదలండి. ప్రచారంతో ప్రజలకు చేరువకండి"అని సీఎం స్టాలిన్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి తెలిపారు.