ఆలయంలోకి వితంతువు రావొద్దని నిషేధం.. హైకోర్టు తీర్పు ఇదీ..
X
మనుషులందరూ సమానమేనని, ఎవరిపైనా వివక్ష చూపొద్దని రాజ్యంగం, చట్టాలు ఘోషిస్తున్నా కొందరు ఇంకా అనాగరిక కాలంలోనే ఉన్నారు. స్త్రీలపై, దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆలయాల్లోకి దళితులు రావొద్దని నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట ఆంక్షలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో సంప్రదాయం పేరుతో మహిళలపైనా నిషేధం కొనసాగుతోంది. స్త్రీలు కూడా దేవుడి సృష్టిలో భాగమని, దేవతలు కూడా అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ సంతతేనని శాస్త్రాలు చెబుతున్నా ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం ‘నో ఎంట్రీ’ అంటున్నారు.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళంలోని పెరియకరుప్పన్ ఆలయంలో వితంతువులను అనుమతించకపోవడంపై వివాదం చెలరేగింది. ఆచారం పేరుతో ఆలయ నిర్వాహకుల్లో కొందరు వితంతువులను లోనికి అనుమతించడం లేదు. నిత్యం ఈ నిషేధం ఉన్నా, ఆగస్టు నెలలో మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. దీన్ని ఓ మహిళ ఈ నిషేధాన్ని మద్రాస్ హైకోర్టులో సవాలు చేసింది. తంగమణి అనే వితంతువు గత ఏడాది ఆగస్ట్ నెలలో గుడిలో జరిగిన ప్రత్యేక ఉత్సవాలకు వెళ్లగా ఇద్దరు నిర్వాహకులు అయ్యావు, మురళి ఆమెను లోనికి పంపకుండా అడ్డుకున్నారు. తంగమణి మొదట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ఆలయ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మూఢనమ్మకాలను వదిలించుకున్న దేశం అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తూ ముందుకుపోతుంటే ఇంకా ఇలాంటి వివక్ష కొనసాగడం అమానుషమని గర్హించారు. అయ్యావు, మురళిలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తంగమణి దేవుణ్ని దర్శించుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లూ చేసిన రక్షణ కల్పించాలని పోలీసులకు స్పష్టం చేశారు.