ఆఫర్ అదిరింది.. కిలో టమాటా రూ. 60కే..! ఎక్కడంటే...?
X
పెరుగుతున్న నిత్యావసర ధరలతో పాటు.. కూరగాయల రేట్లు కూడా మండిపోతున్నాయి. సామాన్యుడు ఏం కొనాలన్నా, తినాలన్నా భయపడుతున్నాడు. ధరకు కొండెక్కడంతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. దలారులు ఇష్టారీతిన ధరలు పెంచుకుంటూ పోతుంటే.. ప్రభుత్వం చర్యలు చేపట్టడంలేదు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం రూ.60కే కిలో టమాటాను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని చౌక ధరల దుకాణాల్లో ఈ ధరలు అమలవుతున్నాయి. చెన్నైలోని 82 చౌక ధరల దుకాణాల్లో మంగళవారం (జులై 4) నుంచి కిలో టమాటాను రూ. 60 కి అమ్ముతున్నట్లు అధికారులు ప్రకటించారు.
మరీ అవసరం అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తామని మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ ప్రకటించారు. చెన్నైలో ఫామ్ ఫ్రెష్ ఔట్లెట్స్, కొయంబత్తూర్, సేలం, వెల్లూర్‌లో విక్రయ కేంద్రాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఒక కుటుంబానికి రోజుకు ఒక కిలో టమాటాను అమ్ముతున్నట్లు కో ఆపరేటివ్ అధికారులు తెలిపారు. కోయంబేడు హోల్ సేట్ మార్కెట్ లో కిలో టమాటా ధర రూ.110 పలుకుతోంది. టమాటాతో పాటు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్త మీర ధరలు కూడా మండిపోతున్నాయి. వీటి ధరలు రూ. 150 నుంచి రూ.200 ఉన్నాయి.