మంత్రిని తొలగించిన గవర్నర్..తమిళనాడులో సంచలనం
X
తమిళనాడు గవర్నర్, డీఎంకే ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇది చాలదన్నట్లు ఈ మంటలకు మరింత ఆజ్యం పోసే విధంగా గవర్నర్ తాజాగా ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి సెంథిల్ బాలాజీని డిస్మిస్ చేస్తూ గవర్నర్ ఆర్.ఎన్.రవి అసాధారణమైన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో మరో కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. ఈ విషయాన్ని సీఎం ఎం.కె.స్టాలిన్ తీవ్రంగా పరిగణించడంతో పాటు
కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో గవర్నర్ ఎట్టకేలకు దిగొచ్చారు. అటార్నీ జనరల్‌తో సంప్రదింపుల కోసమంటూ గవర్నర్ ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపేశారు.
అవినీతి ఆరోపణల కేసులో జూన్ 14న మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మంత్రికి పలు నేరాలతో సంబంధం ఉండటంతో ఆయనకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. అరెస్టు అనంతరం అప్పటి వరకు సెంథిల్ చూసుకున్న విద్యుత్, ఎక్సైజ్ శాఖలను మంత్రులు తంగం తెన్నరసు , ముత్తుస్వామికి అప్పగించింది ప్రభుత్వం. శాఖలేని మంత్రిగా సెంథిల్‌ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఎలాంటి శాఖ లేకపోవడంతో సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుంచి తొలగిస్తూ రాష్ట్ర గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ గురువారం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. గవర్నర్ ఈ నిర్ణయం తమిళనాడులో సంచలనంగా మారింది. ఈ చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిని కేబినెట్ నుంచి తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని ఖండించారు. అనంతరం కేంద్ర హోం మంత్రిత్వశాఖ సూచనలతో గవర్నర్ వెనక్కి తగ్గారు. బర్తరఫ్ ఆదేశాలను హోల్డ్‌లో ఉంచారు.