సాంకేతిక సమస్యా..? మానవ తప్పిదమా..? కోరమాండల్ ప్రమాదానికి కారణమేంటి..?
X
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది. అత్యంత భారీ ప్రాణ నష్టానికి కారణమైన ఈ దుర్ఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రమాదానికి కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక సమస్య వల్లే ఈ ఘోరం జరిగిందా లేక మానవ తప్పిదమే కారణమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రమాదంపై భిన్న కథనాలు
శుక్రవారం సాయంత్రం 6.50 - 7.10గంటల సమయంలో బాలాసోర్ ప్రాంతంలో మూడు రైళ్లు ఢీకొన్నాయి. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. స్థానిక అధికారులు చెప్పిన వివరాల ప్రకారం. తొలుత బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి పక్క ట్రాక్‌పై పడింది. ఆ బోగీలను షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. కోరమాండల్ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొన్నట్లు తెలుస్తోంది. కానీ రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ కథనం మాత్రం మరోలా ఉంది. లూప్ లైనులో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ - షాలిమార్ ఎక్స్ప్రెస్ అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి ట్రైన్ బోగీలు గాలిలో ఎగిరి పక్కనున్న పట్టాలపై పడ్డాయి. అదే సమయంలో పక్క ట్రాక్ పైకి వచ్చిన బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ రైలు ఆ బోగీలను ఢీకొట్టిందని ఆయన చెబుతున్నారు. ఇలా భిన్న కథనాలు వినిపిస్తుండటంపై దీంతో ప్రమాదంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సిగ్నలింగ్ లోపమా
ఒకవేళ స్థానిక రైల్వే అధికారులు చెప్పింది నిజమైతే గూడ్స్ రైలు ఉన్న లూప్ లైన్ లోకి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎందుకెళ్లిందన్న ప్రశ్న తలెత్తుతోంది. సిగ్నల్ ఇవ్వడంలో నిర్లక్ష్యం జరిగిందా లేక సిగ్నలింగ్ వ్యవస్థలో టెక్నికల్ ప్రాబ్లెం తలెత్తి ప్రమాదానికి కారణమైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సాంకేతిక సమస్య కారణంగా తలెత్తిన సమాచార లోపమా లేక మానవ తప్పిదమా అన్నది తేలాల్సి ఉంది. ఈ ప్రమాదంపై ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ విఫలం కావడం వల్లే ప్రమాదం జరిగిందంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు. దీని వెనుక ఇంకేమైనా కారణముందా?’’ అని అంటున్నారు. అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెయిల్ లైన్పైకి గూడ్స్
ఇదిలా ఉంటే సాధారణంగా లూప్ లైన్ పొడవు 750 మీటర్లు ఉంటుంది. గూడ్స్ రైళ్ల కోసం ఎక్కువగా లూప్ లైన్లు వినియోగిస్తారు. బహానగర్ బజార్ స్టేషన్ మేనేజర్ కార్యాలయంలోని సిగ్నల్ ప్యానెల్ ప్రకారం అక్కడి లూప్ లైన్‌లో గూడ్స్ రైలు ఆగి ఉంది. అయితే గూడ్స్ రైలు పొడవు ఎక్కువగా ఉండి చివరి బోగీలు మెయిన్ లైన్‌పై నిలిచి ఉండవచ్చని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో 120కిలోమీటర్లకుపైగా వేగంతో వచ్చిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆ గూడ్స్ రైలు బోగీలను ఢీకొని ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Technical Glitch Or Human Error Questions raises After Odisha Train Crash